V6 News

వారసత్వ సంపదకు అంతర్జాతీయ హంగులు : మంత్రి జూపల్లి

వారసత్వ సంపదకు అంతర్జాతీయ హంగులు : మంత్రి జూపల్లి
  •     హైదరాబాద్‌‌‌‌ను గ్లోబల్ టూరిజం హబ్‌‌‌‌గా మారుస్తం: మంత్రి జూపల్లి
  •     చార్మినార్, టూంబ్స్ ప్రాంతాల్లో పర్యటన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చారిత్రక సంపదకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చి హైదరాబాద్‌‌‌‌ను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రస్థానంలో నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. బుధవారం ఆయన ఎమ్మెల్యేలు మీర్ జుల్ఫికర్ అలీ, కౌసర్ మొహియుద్దీన్‌‌‌‌లతో కలిసి చార్మినార్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. 

చార్మినార్ పరిసరాల సుందరీకరణతో పాటు రూ. 3.64 కోట్లతో మచిలీ కమాన్ పునరుద్ధరణ పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని మంత్రి జూపల్లి తెలిపారు. షేర్-ఇ-బాతీల్ కమాన్ రినోవేషన్ తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కుతుబ్ షాహి టూంబ్స్ నుంచి గోల్కొండ కోట వరకు 1.3 కిలోమీటర్ల మేర నిర్మించ తలపెట్టిన రోప్ వే ప్రాజెక్టు అనుమతులు క్లియరెన్స్ స్టేజీలో ఉన్నాయని, త్వరలోనే డీపీఆర్ సిద్ధం చేస్తామని వివరించారు. 

కటోరా హౌస్‌‌‌‌ను పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఖజానా బిల్డింగ్ మ్యూజియం వెనుక ఉన్న ఆక్రమణలను వారం రోజుల్లోగా తొలగించాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు నూతన పర్యాటక విధానాన్ని రూపొందిస్తున్నామని, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల స్థానికులకు ఉపాధి, ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ పర్యటనలో చౌమహల్లా ప్యాలెస్ వద్ద బ్రిటన్ పర్యాటకుడితో మంత్రి సరదాగా ముచ్చటించడం విశేషం.