హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. బుధవారం బంజారాహిల్స్‌లో తాగునీటిని వృథా చేసిన ఒక వ్యక్తికి ఏకంగా రూ. 10 వేలు జరిమానా విధించారు. జలమండలి (వాటర్ బోర్డు) ఎండీ అశోక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ ప్రధాన రహదారి గుండా వెళ్తున్నారు.
ఆ టైంలో రోడ్ నంబర్ 12 లో ఉన్న 'ఆరెంజ్ ట్రీ ఫర్నిచర్ షాప్' ప్రాంగణాన్ని సదరు షాపుకు సంబంధించిన ఒక వ్యక్తి బోర్డు సరఫరా చేసే తాగునీటితో కడుగుతూ కనిపించాడు. తాగునీటిని రోడ్డుపై పోసి వృథా చేయడం చూసి ఎండీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నిబంధనల ఉల్లంఘనకు గానూ అతనికి నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. భారీగా జరిమానా విధించాల్సిందిగా సంబంధిత మేనేజర్‌కు ఎండీ అశోక్ రెడ్డి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఎండీ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగి ఆ వ్యక్తికి రూ. 10,000 ఫైన్ విధించారు.
