దేశమంతా తగ్గినా మీ స్టోర్లో తగ్గవా.. జీఎస్టీ రేట్లపై నిలదీస్తున్న హైదరాబాద్ కస్టమర్లు

దేశమంతా తగ్గినా మీ స్టోర్లో తగ్గవా.. జీఎస్టీ రేట్లపై నిలదీస్తున్న హైదరాబాద్ కస్టమర్లు

కావాలనే రైస్ బ్యాగ్ కొన్న.. వారం రోజుల కింద ఏ ధర ఉందో.. ఇప్పుడు కూడా అదే ధర ఉంది.. జీఎస్టీ రేట్లు తగ్గించినా ధరలు తగ్గవా.. దేశమంతా తగ్గినా.. మీ స్టోర్ లో తగ్గవా.. నాకు సరైన ఆన్సర్ కావాలి.. ఇవి హైదరాబాద్ లో ఒక కస్టమర్ మాటలు. తగ్గిన జీఎస్టీ రేట్లు సోమవారం (సెప్టెంబర్ 22) నుంచి అమలులోకి వస్తున్నప్పటికీ.. హైదరాబాద్ లో చాలా స్టోర్లు, షాపులలో పాత రేట్లతోనే అమ్మకాలు జరుపుతుండటంపై కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తగ్గిన రేట్లు ఏంటో చూపించాలని డిమాండ్ చేస్తున్నారు. 

సోమవారం రత్నదీప్ సూపర్ మార్కెట్ లో స్టోర్ మేనేజర్ తో కస్టమర్ వాగ్వాదానికి దిగటం వైరల్ గా మారింది. ధరలు తగ్గుతున్నాయని భారీ ఆశలతో షాపింగ్ కు వెళ్తే.. పాత ధరలతోనే కస్టమర్లను మోసం చేయడంపై మండిపడ్డాడు. 

రైల్ బ్యాగ్, వంట సామాగ్రి, సబ్బులు మొదలైన వస్తులను కొన్న కస్టమర్.. బిల్లు చూసి షాకయ్యాడు. ధరలు తగ్గాయి కదా.. కాస్త మిగులుతుందిలే అనుకుంటే.. పాత ధరలతోనే బిల్లు బారెడు వచ్చే సరికి అసంతృప్తికి గురయ్యాడు. ఈ రోజు నుంచి సామాన్యుల జీవితం మారిపోతోందని.. డబ్బులు మిగులుతాయని నాయకులు డబ్బాలు కొడుతున్నారు.. మీరేమో పాత రేట్లతో మోసం చేస్తున్నారు.. ధర ఎందుకు తగ్గలేదో చెప్పండి.. అంటూ నిలదీశాడు. 

హైదరాబాద్ వ్యాప్తంగా చాలా స్టోర్లు, షాపుల్లో కొందరు పాత రేట్లతోనే మోసం చేస్తుండటంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు లేబుల్ వేసిన వస్తులపై కూడా జీఎస్టీ తగ్గింపు ధరలు అమలవుతాయని కేంద్రం పేర్కొంటే.. ఇక్కడ ధరలు తగ్గించకపోవంపై కస్టమర్లు సీరియస్ అవుతున్నారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.