హైదరాబాద్ రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు ఎస్ఓటీ పోలీసులు. గురువారం ( నవంబర్ 6 ) బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్దతిలో డ్రగ్స్ తరలిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి బస్సులో హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలిసులు.
డ్రగ్ సప్లయర్స్ సంగడి సంతోష్ తో పాటు గాంధీ, సందీప్ కండేపల్లి శివ, పలక సాయిబాబులను అరెస్ట్ చేశారు పోలీసులు. నలుగురు నిందితుల నుంచి పెద్ద మొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇదిలా ఉండగా.. ముషీరాబాద్ లో అక్రమంగా డ్రగ్స్ విక్రయిస్తున్న డాక్టర్ ను పట్టుకున్నారు పోలీసులు. ఒక డాక్టర్ తన ఇంట్లోనే డ్రగ్స్ అమ్ముతున్న విషయం తెలిసి పోలీసులు విస్తుపోయారు. ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ జాన్ పాల్ను అరెస్ట్ చేశారు. 3 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. జాన్ పాల్ ఇంట్లో STF బీ టీం సోదాలు చేసింది. ప్రమోద్, శరత్, సందీప్ అనే ముగ్గురు యువకులు.. బెంగళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకుని డాక్టర్ ఇంట్లో అమ్ముతున్నారు. డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ పెట్టి తెలిసిన వారికి అమ్మకాలు జరిపినట్లు విచారణలో తేలింది.
ఈ డ్రగ్స్ దందాలో డాక్టర్ తో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం గురించి పోలీసులు మాట్లాడుతూ.. ఈ డాక్టర్ ప్రాణాంతకమైన డ్రగ్స్కు బానిస అయ్యాడని చెప్పారు. డ్రగ్స్ కొనాలంటే తన దగ్గర తగినంత డబ్బు లేదని ముగ్గురు స్నేహితులతో డ్రగ్స్ వ్యాపారంలో పాలు పంచుకున్నాడు.
