నెక్నాంపూర్ ఫ్లోటిల్లా అపార్ట్‌‌మెంట్స్‌‌లో చోరీ..చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనని అనుమానం

నెక్నాంపూర్ ఫ్లోటిల్లా అపార్ట్‌‌మెంట్స్‌‌లో చోరీ..చెడ్డీ గ్యాంగ్ సభ్యులేనని అనుమానం

గండిపేట, వెలుగు: హైదరాబాద్‌‌ నెక్నాంపూర్‌‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌‌మెంట్స్‌‌లో ఆదివారం తెల్లవారుజామున చోరీ ఘటన కలకలం రేపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో సుమారు చెడ్డీ గ్యాంగ్‌‌కు చెందిన ఆరుగురు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అపార్ట్‌‌మెంట్‌‌వాసుల వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:20 గంటల సమయంలో అపార్ట్‌‌మెంట్ వెనుకవైపు, చెరువు వైపు ఉన్న బౌండరీ ఫెన్సింగ్‌‌ను కత్తిరించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు సమాచారం. 

అనంతరం మెట్ల మార్గం ద్వారా సీ బ్లాక్‌‌లోకి వెళ్లి, ప్రస్తుతం సిటీలో లేని ఓ కుటుంబానికి చెందిన ఫ్లాట్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించి, విలువైన వస్తువులను చోరీ చేశారు. ఇదే సమయంలో అపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన మరో నివాసి అనుమానితుల కదలికలను గుర్తించి ప్రశ్నించగా, అతడిపై దాడికి యత్నించినట్లు సమాచారం. అనుమానితుల వద్ద ఆయుధాలు ఉన్నట్లు కూడా స్థానికులు చెబుతున్నారు. అదే సమయంలో పాలు పోసే వ్యక్తి కూడా అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించినట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అపార్ట్‌‌మెంట్‌‌కు చేరుకుని వివరాలు సేకరించారు. అపార్ట్‌‌మెంట్‌‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.