సంక్రాంతి పండుగకు జనాలు పల్లెబాట పట్టారు. నగరంలో ఎక్కువ ఇళ్లకు తాళాలు పడ్డాయి. ఇదే అదనుగా హైదరాబాద్ లో దొంగల ముఠా రెచ్చిపోయింది. మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల లో ఈ రోజు ( 2026 జనవరి 16) తెల్లవారుజామున కనకదుర్గ నగర్ కాలనీ ఫేస్ 4 రోడ్ నంబర్ 2 లోని 5 ఇండ్లు,అణుశక్తి నగర్ కాలనీ లో 6 ఇండ్లను దొంగలు దోచుకున్నారు. ఒకే రాత్రిలో 13 ఇళ్లను టార్గెట్ చేసి భారీ చోరీలు చేయడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అర్దరాత్రి 1.30 గంటల నుండి 3.30 మధ్యలో దొంగతనాలు జరిగినట్లు తెలుస్తోంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెండు రోజుల ముందు కాలనీలో చెట్లకు మందులు కొడుతూ అనుమానాస్పదంగా ముగ్గురు వ్యక్తులు తిరిగారు.భారీగా బంగారం,వెండి,నగదు దొంగతనం అయినట్టు కాలనీ వాసులు తెలిపారు. ఎంత సొమ్ము.. సొత్తు అపహరణ జరిగిందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ...
పోలీసుల సమాచారం ప్రకారం ముందుగానే రెక్కీ నిర్వహించిన దొంగల ముఠా కారులో కాలనీలోకి వచ్చి, చేతిలో కత్తులతో సంచరిస్తూ ఇళ్ల తలుపులు, అల్మారాల లాక్స్‌ను పగులగొట్టి చోరీలకు పాల్పడింది. పలు ఇళ్లలో బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్లిన అనంతరం దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే మేడిపల్లి పోలీసులు, క్లూస్ టీమ్ ఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంగారం,వెండి,నగదు దొంగతనం అయినట్టు కాలనీ వాసులు తెలిపారు.ఎంత అనేది వాటి విలువ తీయాల్సి ఉంది...
