V6 News

ఫ్యూచర్ సిటీలో భారీ మెడికల్ హబ్ : సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీలో  భారీ మెడికల్ హబ్ : సీఎం రేవంత్ రెడ్డి
  •     అంతర్జాతీయ ప్రమాణాలతో ‘మెడికల్ సిటీ’ని నిర్మిస్తం: సీఎం రేవంత్ రెడ్డి
  •     హైదరాబాద్​ను మెడికల్ టూరిజం కేంద్రంగా మారుస్తామని వెల్లడి
  •     అపోలో హాస్పిటల్స్  ‘ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌ను ప్రపంచ స్థాయి మెడికల్ టూరిజం కేంద్రంగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం 30 వేల ఎకరాల ‘ఫ్యూచర్ సిటీ’లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ మెడికల్ హబ్‌‌ను ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. అపోలో హాస్పిటల్స్ ‘ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విదేశీ రోగుల చికిత్స కోసం హైదరాబాద్‌‌కు రావడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఇందుకోసం తాము కేంద్ర విమానయాన శాఖతోపాటు ప్రధాని మోదీతో చర్చించామని ఆయన వెల్లడించారు. రోగుల కోసం విమానాశ్రయంలో ఒక ప్రత్యేక ‘గ్రీన్ ఛానల్’ ఏర్పాటు చేయాలని, విమానం దిగగానే నేరుగా అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి వెళ్లేలా అనుమతులు మంజూరు చేయాలని తాము ప్రతిపాదించామని వివరించారు. 

2028 డిసెంబర్ నాటికి, అనగా తన మొదటి విడత పదవీకాలం ముగిసేలోగా అపోలో సంస్థ తన 100వ ఆస్పత్రిని ప్రారంభించాలని తానే స్వయంగా హాజరవుతానని రేవంత్ రెడ్డి  పేర్కొన్నారు. అపోలో వ్యవస్థాపకులు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి తన నలుగురు కుమార్తెలను సంస్థకు మూలస్తంభాలుగా నిలబెట్టి, దేశంలోనే నిజమైన మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారన్నారు. రాష్ట్రం ఇప్పటికే ఫార్మా రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉందని, ఇక్కడి జీనోమ్ వ్యాలీ నుంచే దేశంలో ఎగుమతయ్యే బల్క్ డ్రగ్స్‌‌లో 40 శాతం వాటా అందుతోందని తెలిపారు. 

ప్రత్యేక ‘మెడికల్ సిటీ’ ఏర్పాటు

ఫ్యూచర్ సిటీలో ఒక ప్రత్యేకమైన 'మెడికల్ సిటీ'ని నిర్మిస్తామని, అక్కడ ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన వైద్య సదుపాయాలు, పరిశోధనా కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని సీఎం రేవంత్ వివరించారు. దీని కోసం తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసిందని, భూములను కూడా కేటాయించామని రేవంత్ రెడ్డి తెలిపారు. 

కేవలం చికిత్స మాత్రమే కాకుండా, వైద్య విద్య  నూతన ఆవిష్కరణలకు ఈ నగరం కేంద్ర బిందువుగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అపోలో అనేది కేవలం ఒక ఆస్పత్రి పేరు మాత్రమే కాదని, అది ఆపదలో ఉన్న కోట్లాది మంది బాధితులకు ఒక గుండె ధైర్యం అని అభివర్ణించారు. సామాన్యులకు కూడా మెరుగైన నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రతాప్ రెడ్డి వేసిన బాట నేడు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోందన్నారు.  

ఒకే వేదికపై విదేశీ రోగులకు అన్నీ సౌకర్యాలు కల్పించే వ్యవస్థ: మంత్రి దామోదర 

మెడికల్ టూరిజం పాలసీ ద్వారా అంతర్జాతీయ రోగులకు ఒకే వేదికపై ఆస్పత్రులు, వైద్యులు, చికిత్స సమాచారం, ప్రయాణ సౌకర్యాలు అందించే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ప్రత్యేక మెడికల్ టూరిజం సొసైటీ, మెడికల్ వాల్యూ ట్రావెల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి యూనిఫైడ్ డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ చేపడుతున్నామన్నారు. దేశంలో తొలిసారిగా 46 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళల డిజిటల్ హెల్త్ ప్రొఫైలింగ్ చేపడుతున్నామని తెలిపారు. 

దీంతో మహిళల ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోగలుగుతానుమన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎంఆర్ఐలు, సీటీ స్కాన్లు, స్పెషలిస్ట్ వైద్యులు, ఆధునిక పరికరాలతో మౌలిక వసతులు బలోపేతం చేస్తున్నామన్నారు. జిల్లాల స్థాయిలోనే కనీసం 80 శాతం వైద్య సేవలు అందేలా లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైద్యం వ్యాపారం కాదని.. అది ఒక పవిత్రమైన సేవగా తెలిపారు.