హైద రాబాద్ ను హీలింగ్ క్యాపి టల్ చేస్తం : మంత్రి శ్రీధర్ బాబు

హైద రాబాద్ ను హీలింగ్ క్యాపి టల్ చేస్తం : మంత్రి శ్రీధర్ బాబు
  •     డేటా సైన్స్, డిజిటల్ ఆవిష్కరణలతో 
  •     ‘హెల్త్ కేర్’ అనుసంధానిస్తం: మంత్రి శ్రీధర్​ బాబు
  •     ఫ్యూజ్​ అపెక్​ కనెక్ట్​ సదస్సులో మంత్రి వ్యాఖ్యలు 

హైదరాబాద్​, వెలుగు: ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ ను హీలింగ్  క్యాపిటల్​గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేలా, అవకాశాలను అందిపుచ్చుకునేలా హెల్త్​ కేర్​ను డేటా సైన్స్, డిజిటల్​ ఆవిష్కరణలతో అనుసంధానించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామనిచెప్పారు. లండన్​ కేంద్రంగా పనిచేసే ‘ఫ్యూజ్’ ఆధ్వర్యంలో ‘ఫ్యూజ్​ అపెక్​ కనెక్ట్​ 2026’ పేరిట హెచ్ఐసీసీలో నిర్వహించిన సదస్సులో క్లినికల్ రీసెర్చ్, డేటా సైన్స్ అనుసంధానంపై దేశ, విదేశాల నిపుణులు చర్చలు జరిపారు. 

శనివారం ఏర్పాటు చేసిన ఈ కాన్ఫరెన్స్  ముగింపు వేడుకకు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. హెల్త్ కేర్  భవిష్యత్తు​క్లినికల్​ సైన్స్, ఏఐ, రియల్​ వరల్డ్​ ఎవిడెన్స్​ మేళవింపుపైనే ఆధారపడి ఉంటుందన్నారు. ముఖ్యంగా క్లినికల్  రీసెర్చ్ లో విప్లవాత్మక మార్పులు వస్తాయని, టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఇలాంటి తరుణంలో అందుకు అవసరమైన ఎకో సిస్టంను ఇప్పటి నుంచే అభివృద్ధి చేసేలా అడుగులు వేస్తున్నామన్నారు. 

అందులో భాగంగానే ఏఐ సిటీ, యంగ్  ఇండియన్  స్కిల్స్ వర్సిటీ, జీనోమ్  వ్యాలీ విస్తరణ, డేటా మౌలిక సదుపాయాల అభివృద్ధి, హెల్త్ ప్రొఫైలింగ్, మెడికల్ టూరిజం పాలసీ, తెలంగాణ లైఫ్ సైన్సెస్  స్కూల్ కు శ్రీకారం చుట్టామని వివరించారు. సైన్స్, డేటా, హ్యూమానిటీ కలిసి పనిచేసినప్పుడే సమాజానికి నిజమైన మేలు జరుగుతుందన్నారు. నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యూజ్​ బోర్డు చైర్మన్  స్టీఫెన్ బాఫోర్డ్, తెలంగాణ లైఫ్ సైన్సెస్  డైరెక్టర్  సర్వేశ్​ సింగ్, ఐటీ అడ్వైజర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.