- హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు నగరాలకు హైస్పీడ్ రైలు: మంత్రి కోమటిరెడ్డి
- హైదరాబాద్-పుణే-ముంబై కారిడార్ డీపీఆర్ పూర్తి
- సర్వే దశలో అమరావతి- చెన్నై- బెంగళూరు కారిడార్లు
- సెక్రటేరియెట్‌లో హైస్పీడ్ రైల్ కారిడార్లపై సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ఫ్యూచర్ సిటీ కేంద్రంగా హైస్పీడ్ రైల్ కారిడార్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్–పుణే–ముంబై హైస్పీడ్ రైల్వే కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ పూర్తయ్యిందని, అమరావతి– చెన్నై– బెంగళూరు కారిడార్లకు సర్వే కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు.
సోమవారం సెక్రటేరియెట్‌లో హైస్పీడ్ రైల్వే కారిడార్లపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలను కలుపుతూ నిర్మించనున్న హైస్పీడ్ కారిడార్లపై అధికారులతో చర్చించారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్ అత్యంత అనుకూల నగరమని, అందుకే రాష్ట్రంలో రవాణా మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
అధికారుల పవర్ పాయింట్ ప్రజంటేషన్..
ఇప్పటికే డీపీఆర్ పూర్తయిన హైదరాబాద్–పుణె–ముంబై హైస్పీడ్ రైల్వే కారిడార్‌పై అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. మొత్తం 761 కి.మీ. పొడవు గల హైదరాబాద్–ముంబై కారిడార్‌లో 12 స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వీటిలో 10 ఎలివేటెడ్ స్టేషన్లు, 2 అండర్‌గ్రౌండ్ స్టేషన్లు ఉంటాయన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నాన్‌స్టాప్ సర్వీస్ ద్వారా హైదరాబాద్ నుంచి ముంబైకి కేవలం 2 గంటల 55 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపారు. మధ్యలో అన్ని స్టేషన్ల వద్ద ఆగే సర్వీస్‌లో గంటకు 330 కి.మీ. వేగంతో 3 గంటల 21 నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుందని వివరించారు.
ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా చెన్నై వరకు ప్రతిపాదించిన కారిడార్‌పై ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని అధికారులు తెలిపారు. వికారాబాద్ సమీపంలో 4.6 కి.మీ. టన్నెల్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. అలాగే, భారత్ ఫ్యూచర్ సిటీ–బెంగళూరు కారిడార్‌లో మన్ననూర్, సోమశిల ప్రాంతాలను కలుపుతూ రూపొందించిన కారిడార్ డిజైన్‌ను కూడా పీపీటీ ద్వారా మంత్రికి వివరించారు.
జూన్ 2న సనత్‌నగర్ టిమ్స్ ప్రారంభం
జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్సమన్వయంతో మిగిలిన ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడూ తెలుసుకొని నివేదిక ఇవ్వాలని స్పెషల్ సెక్రటరీకి సూచించారు.
వరంగల్ హాస్పిటల్ భవన నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీసి, అధికారుల బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఇందుధర శాస్త్రి, యూపీ సింహా, రజనీశ్ సరోజ్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయభారతి, సీఈ వనజతో పాటు హెచ్‌ఎండీఏ, ఎంఏయూడీ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.

