
- రెండేండ్ల లోపు విడతల వారీగా రానున్న బస్సులు
- 2026 వరకు వంద శాతం ఎలక్ట్రిక్ వాహనాలు
- ప్రతి డిపోలో చార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా పెంచేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌నాటికి రోడ్లపైకి 277 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ లో 2,800 ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా, ఇందులో 265 ఎలక్ట్రిక్బస్సులు ఉన్నాయి. కాలుష్య నివారణే లక్ష్యంగా, పర్యావరణ పరిరక్షణ కోసం పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అదనపు ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది.
పీఎం ఈ–డ్రైవ్పథకం కింద కొన్నిరోజుల కింద 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. అయితే ఈ బస్సులన్నీ విడతల వారీగా అందజేస్తారని, సిటీకి చేరేసరికి మరో రెండున్నర ఏండ్లు పడుతుందని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్పరిధి విస్తరిస్తుండడంతో ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా బస్సుల డిమాండ్పెరుగుతోంది. ఎలక్ట్రిక్బస్సులతో ఆ కొరత తీరుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి డిపోలో 30 చార్జింగ్ పాయింట్లు!
నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు పెరుగుతుండంతో అందుకు తగ్గట్టు అన్ని డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం గ్రేటర్లో 25 బస్‌డిపోలు ఉండగా, ఇప్పటివరకు కంటోన్మెంట్, మియాపూర్, సెంట్రల్ యూనివర్సిటీ, హయత్‌నగర్–2, బీహెచ్ఈఎల్ డిపోల్లో మాత్రమే ఈవీ చార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. బస్సుల సంఖ్య పెరిగితే ఇవి సరిపోవు. చార్జింగ్పాయింట్ల అవసరం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒక్కో డిపోలో 25 నుంచి 30 చార్జింగ్పాయింట్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈవీ చార్జింగ్పాయింట్లు ఉన్న డిపోల్లో ఒకేసారి 20 బస్సులు చార్జ్అయ్యేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఒక బస్సు వంద శాతం చార్జ్ కావడానికి 2 గంటల టైం పడుతోంది. ఫుల్ఛార్జి అయితే 250 కి.మీ వరకు తిరగొచ్చు. బ్యాటరీ లెవల్20 శాతం పడిపోగానే మళ్లీ చార్జింగ్చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి డిపోలో కనీసం 30 చార్జింగ్పాయింట్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.