- కొత్త బిల్లును ఉపసంహరించుకోవాలి
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ డిమాండ్
రాంగోపాల్ పేట గాంధీ విగ్రహం వద్ద ఆందోళన
పద్మారావునగర్, వెలుగు: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ‘వికసిత్ భారత్ -గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్’ గా మార్చే బిల్లును పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ కాంగ్రెస్ ఇన్చార్జి డా. కోట నీలిమ తీవ్రంగా ఖండించారు. గాంధీ ఆలోచనలు, విలువల పట్ల కేంద్రానికి ఉన్న వ్యతిరేక వైఖరి ఈ బిల్లుతో స్పష్టమవుతోందని విమర్శించారు. మంగళవారం సికింద్రాబాద్ డీసీసీ ఆధ్వర్యంలో రాంగోపాల్‌పేట్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలో ఆమె మాట్లాడారు.
కొత్త విధానంలో వేతన వ్యయాన్ని కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించాలని ప్రతిపాదించడం వల్ల పేద రాష్ట్రాలపై తీవ్ర భారం పడుతుందన్నారు. వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరిగి పథకం పూర్తిగా నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
