మానేరుపై కొట్టుకుపోయిన చెక్ డ్యామ్..గత బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లతో నిర్మాణం

మానేరుపై కొట్టుకుపోయిన చెక్ డ్యామ్..గత బీఆర్ఎస్ హయాంలో వందల కోట్లతో నిర్మాణం
  •     పెద్దపల్లి జిల్లా అడవి సోమనపల్లి వద్ద ఘటన
  •     పనుల్లో క్వాలిటీ లేకనే కొట్టుకుపోతున్నాయనే ఆరోపణలు

పెద్దపల్లి, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో మానేరు నదిపై నిర్మించిన మరో చెక్​డ్యామ్ కొట్టుకుపోయింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్​పల్లి వద్ద మానేరులో ఐదేండ్ల కింద చెక్ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. బుధవారం ఉదయం ఒక్కసారిగా కూలిపోగా, నీళ్లన్నీ వృథాగా పోయాయి. గత నెల ఓదెల మండలం తనుగుల వద్ద కూడా చెక్ డ్యాం కొట్టుకుపోయింది. 

దీంతో అప్పట్లో ఈ ఘటన వెనుక ఇసుక మాఫియా హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తీరా ఇప్పుడు అడవి సోమన్​పల్లి చెక్​డ్యామ్ కూడా కూలిపోవడంతో పనుల్లో క్వాలిటీ లేకే ఇలా జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 కాగా, ఇటీవల దిగువ మానేరు జలాశయం (ఎల్​ఎండీ) గేట్లు ఎత్తడంతో ఆ ప్రవాహ ఉధృతికి అడవి సోమన్ పల్లి చెక్ డ్యాంకు సపోర్ట్​గా ఉన్న అప్రాన్ కూలిపోయిందని, ఈ క్రమంలో పగుళ్లు మొదలయ్యాయని, అవి క్రమంగా పెరిగి బుధవారం ఉదయం 10 గంటల సమయంలో కూలిపోయిందని స్థానిక మత్స్యకారులు చెప్తున్నారు. కొందరు నీటితో పాటు కొట్టుకుపోగా.. ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నారు. మత్స్యకారుల వలలతో పాటు చుట్టుపక్కల వ్యవసాయం కోసం వేసిన మోటార్లు సైతం కొట్టుకుపోయాయి.

నాసిరకం పనులు.. డిజైన్ లో లోపాలు!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మానేరు నదిపై గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో సుమారు రూ.500 కోట్లతో 29 చెక్​డ్యామ్​లు నిర్మించారు. ఇందులో నిర్మించిన కొన్నాండ్లకే 12 దాకా చెక్​డ్యామ్​లు కూలిపోగా.. కొన్ని వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. 

మిగిలినవి ఒక్కొక్కటి కూలుతూ వస్తున్నాయి. సెప్టెంబర్ లో జమ్మికుంట మండలంలోని తునుగుల చెక్​డ్యామ్ కొట్టుకుపోగా, తాజాగా అడవి సోమనపల్లి చెక్​డ్యామ్ కూలిపోయింది. డిజైనింగ్ లోపం, నాసిరకం పనుల వల్లే ఇలా జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మానేరు నది వెడల్పు సుమారు కిలో మీటర్ పైనే ఉంటుంది. అంత వెడల్పులో వాటర్ ఫ్లోటింగ్ కు అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ చేయాలంటే సరైన ప్రణాళిక అవసరం. కానీ, ఎలాంటి ప్లానింగ్ లేకుండాచెక్​డ్యామ్​లు కట్టారని ఎక్స్​పర్ట్స్ చెప్తున్నారు. 

వాగుపై నిర్మించే ఆఫ్రాన్లకు సపోర్టుగా ఇసుక మీదే బెడ్స్ నిర్మించడంతో కింది ఇసుకతో పాటు చెక్​డ్యామ్​లు కొట్టుకుపోతున్నాయని చెప్తున్నారు. కాగా, ఇప్పటికే చెక్ డ్యాంల నిర్మాణాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, విజిలెన్స్ నివేదిక పెండింగ్​లో ఉంది.