నగరవాసులతోపాటు హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకుల కోసం తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రెండు ఓపెన్ టాప్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. లండన్ తరహాలో టాప్ లేని డబుల్ డెక్కర్ బస్సుపై కూర్చొని నగర అందాలను వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నది. నగర వారసత్వ సంపదతోపాటు ఆధునిక కట్టడాలను చూసేలా ఓపెన్ టాప్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేయనున్నది.
ఇప్పటికే బస్సులను సమకూర్చుకునేందుకు ఇటీవల అర్హులైన సంస్థల నుంచి ప్రతిపాదనలు (ఆర్‌ఎఫ్‌పీ) ఆహ్వానించింది. దరఖాస్తులు, బిడ్లు సమర్పించేందుకు బుధవారం వరకు గడువు విధించారు. ఇప్పటికే పలు సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయని టూరిజం అధికారులు చెప్తున్నారు.
అప్పర్ డెక్ ఓపెన్.. లోయర్ డెక్ ఏసీ..
పర్యాటకులను ఆకట్టుకునేలా ఈ బస్సులను తయారు చేస్తున్నారు. బస్సు అప్పర్ డెక్‌కు ఎలాంటి రూఫ్ ఉండదు. దీంతో ప్రయాణికులు ప్రకృతిని ఆస్వాదిస్తూ నగర అందాలను వీక్షించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఎండ, వర్షం వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లోయర్ డెక్‌ను ఏసీ క్యాబిన్‌గా తీర్చిదిద్దుతున్నారు. నగర చరిత్ర, చారిత్రక ప్రాధాన్యతను పర్యాటకులకు వివరించేందుకు మైక్రోఫోన్‌తో కూడిన ఆధునిక గైడ్ వ్యవస్థతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌ను అనుసంధానిస్తున్నారు.
ప్రయాణికుల మొబైల్ ఛార్జింగ్ అవసరాల కోసం ప్రతి సీటు వద్ద యూఎస్‌బీ పోర్టులు ఏర్పాటు చేయనున్నారు. రాత్రివేళల్లో ఆకట్టుకునేలా బస్సులకు ఎల్‌ఈడీ లైట్లు అమర్చనున్నారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం బస్సుల్లో జీపీఎస్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
