హైదరాబాద్‌‌‌‌ లో ఇక ‘ఫారిన్’ పాఠాలు

హైదరాబాద్‌‌‌‌ లో ఇక ‘ఫారిన్’ పాఠాలు
  • ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌డీసీ, టీజీసీహెచ్​ఈ భేటీలో నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఇంటర్నేషనల్ లెవెల్‌‌‌‌లో కొలువులు సాధించేందుకు వీలుగా హైదరాబాద్ వేదికగా విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. స్కిల్ ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో మార్చి మొదటి వారం నుంచి ఇంగ్లిష్​, జర్మన్, జపనీస్ భాషల్లో కోర్సులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం హైదరాబాద్​లో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్(టీజీసీహెచ్​ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వీ.బాలకిష్టారెడ్డి, నేషనల్ స్కిల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ (ఎన్​ఎస్డీసీ) మేనేజర్ ప్రశాంత్ భేటీ అయ్యారు.

పీఎంకేవీవై 4.0, నేషనల్ అప్రెంటిస్ ప్రమోషన్ స్కీమ్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా  భేటీలో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హైదరాబాద్‌‌‌‌లోని కన్హా శాంతి వనంలో ఈ నెల 21 నుంచి 24 వరకూ 'సౌత్ రీజినల్ స్కిల్స్ కాంపిటీషన్' జరగనుందని చెప్పారు.

దీంట్లో 42 రకాల స్కిల్స్‌‌‌‌ను ప్రదర్శించనున్నట్టు వెల్లడించారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు ఎన్​ఎస్డీసీ స్వల్పకాలిక కోర్సుల్లో చేరొచ్చని వివరించారు. రాష్ట్రంలోని విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఎమర్జింగ్ టెక్నాలజీస్, ఫ్యూచరిస్టిక్ స్కిల్స్‌‌‌‌లో శిక్షణ  ఇచ్చేందుకు ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌డీసీ, ఉన్నత విద్యామండలి కలిసి పనిచేస్తాయని చైర్మన్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు.