
హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకూ హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వాన శనివారం సాయంత్రం మళ్లీ మొదలైంది. సాయంత్రం 4 గంటల నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వీకెండ్ కావడంతో వర్షం పడక ముందు నుంచే హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, టోలిచౌకి, ఫిలింనగర్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. మెహదీపట్నం రోడ్డులో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జూబ్లీహిల్స్ అపోలో రోడ్డులో ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు నానా తిప్పలు పడ్డారు. ఒకపక్క వర్షం.. మరో పక్క ట్రాఫిక్ జాం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్లోని నాంపల్లి, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, సైఫాబాద్, బేగంబజార్, బషీర్ బాగ్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, మెట్టుగూడ, బేగంపేట్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో కూడా వాన మొదలైంది. హైదరాబాద్లో వర్షం మొదలవడంతో పద్మ నగర్ వాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
శుక్రవారం కురిసిన కుండపోత వానకు రిటైనింగ్ వాల్ కూలింది. రిటైనింగ్ వాల్ కూలడంతో దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ పునాదులు బయటపడ్డాయి. రెండు ఫీట్ల మేర బిల్డింగ్, అపార్ట్మెంట్ కింద పునాది, మెటీరియల్ కొట్టుకుపోయింది. వర్షపు నీరు ఎక్కువైతే నాలా ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. నాలా ఉధృతంగా ప్రవహిస్తే బిల్డింగ్ నేలమట్టమయ్యే ప్రమాదం ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.