లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో.. హైదరాబాద్ రికార్డు వృద్ధి..దక్షిణాదిలోనే నంబర్1

లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో..  హైదరాబాద్ రికార్డు వృద్ధి..దక్షిణాదిలోనే నంబర్1
  • 2026లో రూ.8,562 కోట్ల లావాదేవీలు
  • నాలుగేళ్లలో 3.5 రెట్ల వృద్ధి
  • సోథెబీస్ రియల్టీ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ:దక్షిణ భారత అల్ట్రా లగ్జరీ రెసిడెన్షియల్​ మార్కెట్​లో హైదరాబాద్ మొదటిస్థానంలో నిలిచింది. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.10 కోట్లు, అంతకంటే ఎక్కువ ధర గల ఇండ్ల విభాగంలో హైదరాబాద్ రూ.8,562 కోట్ల లావాదేవీలను నమోదు చేసింది. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఇండియా ఎస్​ఐఆర్​), సీఆర్​ఈ మ్యాట్రిక్స్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. 

దీని ప్రకారం..హైదరాబాద్ లగ్జరీ హోమ్​ విభాగం నాలుగేళ్లలోనే రూ.2,447 కోట్ల నుంచి రూ.8,562 కోట్లకు చేరుకుంది. ఇది 3.5 రెట్లు పెరగడం విశేషం. కోకాపేట్ వంటి ప్రాంతాల్లో భారీ అపార్ట్​మెంట్లు, విల్లాలకు పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణం. వినియోగదారులు ప్రస్తుతం విశాలమైన గృహాల కొనుగోలుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కోకాపేట్ కారిడార్ వంటి ప్రాంతాల్లో పూర్తిస్థాయి లగ్జరీ రెసిడెన్షియల్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందుతోంది.

విస్తీర్ణం పరంగానూ హైదరాబాద్ ముందంజహైదరాబాద్​లో అమ్ముడైన ఇళ్లలో దాదాపు 57 శాతం అపార్ట్​మెంట్లు 8 వేల చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మొత్తం విక్రయ విలువలో విల్లాలు, రో హౌస్​ల వాటా 40 శాతంగా ఉంది. బెంగళూరులో లగ్జరీ ఇండ్ల విక్రయాలు 2025 ఆర్థిక సంవత్సరంలో 84 ఉండగా 2026 ఆర్థిక సంవత్సరంలో 128కి పెరిగాయి. రూ.10 కోట్ల పెట్టుబడికి హైదరాబాద్​లో సుమారు 6,210 చదరపు అడుగుల స్థలం లభిస్తోంది. 

బెంగళూరులో ఇది 3,930 చదరపు అడుగులు, చెన్నైలో 4,290 చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్​లో 60 శాతం అధిక స్థలం లభిస్తుండటం గమనార్హం. సీఆర్​ఈ మ్యాట్రిక్స్ కో– ఫౌండర్, సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ    వసతులు, విశాలమైన స్థలాల కారణంగా హైదరాబాద్​కు డిమాండ్​ఎక్కువ ఉందని వివరించారు.  నగరాలను బట్టి పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవాలని ఆయన సూచించారు.

బెంగళూరు జోరు

బెంగళూరు నగరం విక్రయాల విలువ పరంగా రూ.1,957 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ వేగవంతమైన వృద్ధిని సాధించింది. యూనిట్ల విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 52 శాతం వృద్ధి కనిపిస్తోంది. చెన్నై మార్కెట్ కొన్ని ప్రాంతాలకే పరిమితమై రూ.727 కోట్ల విక్రయాలను సాధించింది. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియాల్టీ సీఈఓ అశ్విన్ చద్ధా మాట్లాడుతూ హైదరాబాద్ అల్ట్రా లగ్జరీ విభాగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిందని పేర్కొన్నారు. 

బెంగళూరు వేగంగా కొత్త కారిడార్లను నిర్మిస్తోందని చెప్పారు. చెన్నైలోని అభిరామపురం, అల్వార్​పేట వంటి ప్రాంతాలు ఇప్పటికీ ప్రతిష్టాత్మక ప్రాంతాలుగా కొనసాగుతున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లోని గ్రేడ్– ఏ ఆఫీస్ లీజింగ్ పరిమితంగా ఉండటం వల్ల చెన్నై వృద్ధి కొంత తక్కువగా ఉంది. అక్కడ అధిక ఆదాయం ఉన్న కొనుగోలుదారుల సంఖ్య తక్కువగా ఉండటం మార్కెట్ వృద్ధిపై ప్రభావం చూపుతోంది.