
హెరిటేజ్‌వాక్ సందర్భంగా పాతబస్తీలోని చార్మినార్ వద్ద 2 వేల మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ కల్పించారు. మూడు రోజులు ముందుగానే చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ సహా పాతబస్తీలోని పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సీపీ సీవీ ఆనంద్, సౌత్‌జోన్ డీసీపీ స్నేహా మెహ్రా బందోబస్త్‌ను పర్యవేక్షించారు. మిస్‌వరల్డ్ కంటెస్టెంట్లు పర్యటించే ప్రాంతాలను సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. వాటిని ముగ్గురు అడిషనల్ డీసీపీల ఆధ్వర్యంలో మానిటరింగ్ చేశారు.
లా అండ్ ఆర్డర్, టాస్క్‌ఫోర్స్ సహా రెండు బృందాల ఆక్టోపస్ బలగాలు, క్విక్ రియాక్షన్ టీమ్స్ సోమవారం రాత్రి నుంచే పాతబస్తీలో నిఘా పెట్టాయి. ముందస్తుగా డాగ్ స్క్వాడ్, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను బైండోవర్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 వరకు వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లించారు. మదీనా, చార్మినార్, శాలిబండ, ఓల్గా జంక్షన్, ఖిల్వత్ రోడ్లను పూర్తిగా క్లోజ్ చేశారు.