హెవీ వెహికల్ డ్రైవర్లకు కంటి పరీక్షలు

హెవీ వెహికల్ డ్రైవర్లకు కంటి పరీక్షలు
  • నాంపల్లిలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

బషీర్​బాగ్, వెలుగు: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు శుక్రవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో “అరైవ్ అలైవ్” రెండో దశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యంగా భారీ వాహనాల డ్రైవర్లకు రహదారి భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు మెడి విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్–2 డీసీపీ కాజల్ హాజరయ్యారు. సుమారు 150 మంది డ్రైవర్లకు డ్రైవింగ్ నియమాలపై దిశానిర్దేశం చేశారు. ఇదే వేదికపై గత 35 ఏండ్లుగా ఎలాంటి ప్రమాదాలు చేయకుండా క్షేమంగా వాహనాలు నడుపుతున్న ఇద్దరు సీనియర్ డ్రైవర్లను డీసీపీ శాలువాతో ఘనంగా సత్కరించారు. ట్రాఫిక్ ఏసీపీ ధనలక్ష్మితో పాటు పలువురు సీఐలు పాల్గొన్నారు.

వికారాబాద్: అరైవ్​-అలైవ్ క్యాంపెయిన్​లో భాగంగా  వికారాబాద్​లోనూ పోలీసులు శుక్రవారం డ్రైవర్లకు ప్రత్యేక కంటి వైద్య శిబిరం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా మాట్లాడుతూ.. వాహనదారులు చేసే చిన్నపాటి నిర్లక్ష్యం వారి బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగులుస్తోందన్నారు.