
- పౌరులే ఫొటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని సూచన
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలకు కారణమమతున్న రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. తమతో పాటు ఎదుటి వారినీ ప్రమాదాలకు గురిచేస్తున్న రాంగ్‌రూట్ డ్రైవర్లను దారిలో పెట్టేందుకు వినూత్న ప్రయోగం చేపట్టారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న అన్ని రోడ్లలో రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారెవరైనా ఫొటో తీసి ట్రాఫిక్ పోలీస్ వెబ్‌సైట్, ఎక్స్ లో పోస్ట్ చేయవచ్చని ప్రజలకు సూచించారు.
ఇప్పటికే హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సిటిజన్లు పోస్ట్ చేస్తున్న ఫొటోల ఆధారంగా చలానాలు జనరేట్ చేసి జరిమానా విధిస్తున్నారు. కాగా.. ‘యూటర్న్స్’ వద్దే రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తున్నారు. సిటీలో మెహిదీపట్నం సహా రద్దీ ప్రాంతాల్లో సగటున కిలోమీటర్ నుంచి రెండు కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి వస్తోంది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ షార్ట్ కట్ కోసం అపోజిట్ డైరెక్షన్ లో డ్రైవింగ్ చేస్తున్నారు.
దీంతో సరైన మార్గంలో వచ్చేవారు సైతం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు కూడా నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. దీంతో రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా పోలీసులు స్సెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.