హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటన..ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్​లో ఇవాళ సాయంత్రం జరగనున్న ప్రధాని మోదీ సభ నేపథ్యంలో మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. వీవీఐపీ కాన్వాయ్​ల రాకపోకలు, సభకు వచ్చే లక్షలాది మందిని దృష్టిలో ఉంచుకుని పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో దారి మళ్లింపులు చేపట్టనున్నారు. ముఖ్యంగా బేగంపేట్, ప్యారడైజ్, పట్నీ, క్లాక్​టవర్, సంగీత్ జంక్షన్, బోయిన్​పల్లి, తిరుమలగిరి మార్గాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుందని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

  •    బేగంపేట్ నుంచి సంగీత్ జంక్షన్ వైపు వెళ్లేవారు ప్యారడైజ్, పట్నీ మీదుగా క్లాక్​టవర్ మార్గాన్ని ఎంచుకోవాలి.
  •    బేగంపేట్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే వాహనదారులు సెయింట్ జాన్స్ రోటరీ, ఏఓసీ మార్గం ద్వారా వెళ్లాలి.
  •    బాలానగర్ నుంచి వచ్చేవారు అమీర్​పేట్, పంజాగుట్ట మీదుగా లేదా రసూల్​పురా, మినిస్టర్ రోడ్ ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు.
  •    ట్యాంక్​బండ్ నుంచి తిరుమలగిరి వైపు వెళ్లే ప్రయాణికులు సీటీవో, తాడ్​బండ్, డైమండ్ పాయింట్ మార్గాలను వినియోగించుకోవాలి. 
  •    మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు సభా ప్రాంగణానికి వెళ్లే మార్గాల్లో భారీ వాహనాలు, ఆర్టీసీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై నిషేధం ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. ప్రజలు సాధ్యమైనంత వరకు మెట్రో రైలును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
  •   రహదారులపై ఎక్కడపడితే అక్కడ వాహనాలను నిలిపివేస్తే టోయింగ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తామన్నారు.  అత్యవసర సేవల వాహనాలను పరిస్థితిని బట్టి అనుమతి ఉంటుందని, వాహనదారుల సహాయం కోసం ప్రత్యేక హెల్ప్​లైన్ నంబర్ 8712662999 సంప్రదించాలని సూచించారు. సభకు వచ్చే వారి కోసం 12 ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను సిద్ధం చేశారు.