- అపస్మారక స్థితిలో మృతురాలి తల్లి.. పరిస్థితి విషమం
- హైదరాబాద్ హస్తినాపురంలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ తన 11 నెలల కొడుకుకు విషమిచ్చి చంపి.. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో మృతురాలి తల్లి సైతం విష ప్రభావంతో అపస్మారక స్థితికి చేరుకొని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్హస్తినాపురంలో చోటుచేసుకుంది. మీర్ పేట్ కు చెందిన సుష్మకు, హస్తీనాపురంలో ఉండే యశ్వంత్ రెడ్డికి నాలుగేండ్ల క్రితం పెండ్లి జరిగింది.
యశ్వంత్ రెడ్డి చార్టర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. వీరికి 11 నెలల కొడుకు(యశ్వవర్ధన్ రెడ్డి) ఉన్నాడు. సుష్మ, యశ్వంత్ రెడ్డి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సుష్మ తల్లి లలిత బుధవారం సాయంత్రం వారి వద్దకు వచ్చింది. గురువారం ఉదయం కూడా భార్యాభర్తల మధ్య లలిత ముందే గొడవ జరిగింది. గొడవ తర్వాత యశ్వంత్ రెడ్డి బయటకు వెళ్లిపోయాడు.
గురువారం రాత్రి 9 గంటల సమయంలో సుష్మ తన కొడుకు యశ్వవర్ధన్ రెడ్డికి విషమిచ్చి చంపి.. బెడ్రూంలోకి వెళ్లి సీలింగ్ ప్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అరగంట తరువాత యశ్వంత్ రెడ్డి ఇంటికి వచ్చి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. పక్కింటి వారి సాయంతో తలుపు పగలగొట్టి చూడగా అప్పటికే సుష్మ, ఆమె కొడుకు మృతిచెంది ఉన్నారు.
సుష్మ తల్లి లలిత అకస్మారక స్థితిలో కనిపించింది. వెంటనే ఆమెను అపోలో డీఆర్డీఏ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం లలిత పరిస్థితి విషమంగా ఉంది. అయితే, లలిత.. తన కూతురు, మనుమడు చనిపోవడాన్ని తట్టుకోలేక ఆమె కూడా విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుందా? లేక సుష్మనే తన కొడుకుకు విషం ఇచ్చే సమయంలోనే తల్లికి కూడా ఏదైనా ఫుడ్ లో విషం ఇచ్చిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
