
విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కు విమాన టికెట్లు బుక్ చేస్తామని నిండాముంచాడు ఓ అక్రమార్కుడు. అమెరికా, యూకే, కెనడా దేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని మోసం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ అబిడ్స్ లో జరిగింది.
అబిడ్స్ లతీఫ్ బిల్డింగ్ లో CTS కార్పొరేట్ సొల్యూషన్ ట్రావెల్ ఏజెన్సీ ఉంది. కుతుబుద్దీన్ అనే వ్యక్తి ఈ ట్రావెల్ ఏజెన్సీని నడిపిస్తున్నాడు. ఇందులో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు టికెట్స్ బుక్ చేస్తామని నమ్మబలికాడు. 30 మంది బాధితుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి ట్రావెల్ ఏజెంట్ కుతుబుద్దీన్ పరారయ్యాడు. ట్రావెల్ ఏజెన్సీ బోర్డు తిప్పేయడంతో విదేశాలకు వెళ్లాల్సిన విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 ఆగస్టు 15 , 16 తేదీలలో అమెరికా వెళ్లేందుకు దాదాపు 40 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. ట్రావెల్ ఏజెన్సీ యజమాని ఒక్కొక్కరి నుంచి లక్షన్నర నుండి రెండు లక్షల వరకు వసూలు చేశారు. అయితే టికెట్ డిటేయిల్స్ రాలేవని ట్రావెల్ ఏజెన్సీకి బాధితులు వెళ్లారు. అయితే గత రెండు రోజులుగా ట్రావెల్ ఏజెన్సీ ఓపెన్ చేయలేదని చుట్టుపక్కల వాళ్లు తెలిపారు. దీంతో తాము మోసాపోయామన్న నిజం తెలుసుకుని లబోదిబోమన్నారు బాధితులు.
ట్రావెల్ ఏజెన్సీ బోర్డు తిప్పేయడంతో బాధితులు.. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో ట్రావెల్ ఏజెన్సీ యజమాని కుతుబుద్దీన్ పై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. గతంలో CTS కార్పొరేట్ ట్రావెల్ ఏజెన్సీపై పలు చీటింగ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.