- మొదటిసారి నోటీసు, రూ.10 వేల జరిమానా
- అదే తప్పు మళ్లీ చేయడంతో వాటర్బోర్డ్ యాక్షన్
- మరెవరైనా ఇలా చేస్తే ఇట్లాంటి చర్యే ఉంటుందన్న ఎండీ
హైదరాబాద్ సిటీ, వెలుగు: వాటర్ బోర్డు సరఫరా చేసే తాగునీటిని రెండో సారి వృథా చేయడంతో ఏకంగా ఆ ఇంటి కనెక్షన్‌నే కట్‌చేసి పడేశారు వాటర్‌బోర్డు అధికారులు. ఈ ఇంటి యజమాని గతంలో నీటిని వృథా చేయగా రూ.10 వేల ఫైన్వేశారు. అదే తప్పును మళ్లీ చేయడంతో తీవ్ర చర్యలు తీసుకున్నారు. గతేడాది సెప్టెంబర్ 3 న బంజారా హిల్స్ రోడ్ నం. 12 లో ఓ వ్యక్తి తాగునీటి సంపు నిండి ఓవర్ ఫ్లో అయి దాదాపు కిలో మీటర్ వరకు తాగునీరు వృథాగా పారింది.
దీంతో ఓ అండ్ డివిజన్ స్థానిక మేనేజర్ వెళ్లి పరిశీలించి తాగునీటిని వృథా చేయవద్దని చెప్పి, నోటీసు ఇచ్చారు. ఎండీ ఆదేశాల మేరకు రూ.10 వేల ఫైన్వేశారు. మరో సారి ఇలా చేస్తే కనెక్షన్ తొలగిస్తామని అప్పుడే హెచ్చరించారు. బుధవారం ఎండీ అశోక్ రెడ్డి బంజారా హిల్స్ మెయిన్‌రోడ్డుపై వెళ్తుండగా రోడ్ నంబర్12 లో నీరు లీకేజి అయినట్టు గమనించారు.
గతంలోనూ నిర్లక్ష్యంతో నీటిని వృథా చేసినందుకు జరిమానా విధించారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో సారి నీటి వృథా చేస్తున్నందుకు కనెక్షన్ తొలగించాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ఆ ఇంటి కనెక్షన్‌ను కట్‌చేశారు. తాగునీరు అతి విలువైనదని, ఎవరైనా నీటి వృథా చేస్తే ఇలాంటి కఠిన చర్యలే తీసుకుంటామని ఎండీ హెచ్చరించారు.
