వాటర్ బోర్డుకు రావాల్సింది రూ.3 వేల కోట్లు..త్వరలోనే వసూళ్లకు స్పెషల్ డ్రైవ్

వాటర్ బోర్డుకు రావాల్సింది  రూ.3 వేల కోట్లు..త్వరలోనే వసూళ్లకు స్పెషల్ డ్రైవ్
  • నెలకు రూ.150 కోట్లలో వస్తున్నది రూ.100 కోట్లే 
  •     జీతాలు, మెయింటనెన్స్, ప్రాజెక్టులకు నిధుల కొరత  
  •     త్వరలోనే వసూళ్లకు స్పెషల్​ డ్రైవ్​  

హైదరాబాద్​సిటీ, వెలుగు: పేరుకుపోయిన మొండి బకాయిల వసూలుకు వాటర్ బోర్డు సిద్ధమైంది. ప్రస్తుతం వివిధ కేటగిరీల వినియోగదారుల నుంచి దాదాపు రూ.3వేల కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. నెలకు నీటి ఛార్జీల రూపంలో రూ.150 కోట్లు రావాల్సి ఉండగా, రూ.98 నుంచి రూ.100 కోట్ల వరకే వస్తోంది. దీంతో మెయింటనెన్స్, జీతాలు, కొత్త ప్రాజెక్టులకు డబ్బులు సరిపోవడం లేదు.  ఇప్పటికే బోర్డు పరిధిని క్యూర్​వరకూ విస్తరించడంతో ఆపరేషన్​అండ్​మెయింటెనెన్స్​కు భారీగా నిధులు ఖర్చవుతున్నాయి. వచ్చే ఆదాయం కంటే ఖర్చే ఎక్కువగా ఉండడంతో త్వరలోనే స్పెషల్​డ్రైవ్​కు రెడీ అవుతోంది. 

రూ.3 వేల కోట్లు టార్గెట్​

బోర్డు పరిధిలో 14.80 లక్షల నల్లా కనెక్షన్లు ఉండగా, బల్క్​, కమర్షియల్, పరిశ్రమలు, డొమెస్టిక్​ వినియోగ దారులకు నీటి సరఫరా చేస్తోంది. వీటి ద్వారా నెలకు రూ.150 కోట్లకు బదులుగా రూ.100 కోట్లలోపే వస్తున్నాయి. నెల నెలా ఈ బకాయిలు పేరుకుపోతున్నాయి. టౌన్​షిప్​లు, గేటెడ్​కమ్యూనిటీలు, మున్సిపాలిటీలు, వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసే బల్క్​వినియోగ దారుల నుంచే రూ.1,360 కోట్లు రావాల్సి ఉంది. 

సాధారణ వినియోగ దారుల నుంచి రూ.900 కోట్లు, బల్క్​గా సరఫరా చేసే కాలనీల నుంచి రూ.140 కోట్లు, కమర్షియల్​వినియోగ దారుల నుంచి రూ.340 కోట్లు, పరిశ్రమల నుంచి రూ.280 కోట్లు రావాలి. మొత్తంగా రూ. 3వేల కోట్ల వరకూ బకాయిలు పేరుకుపోవడంతో త్వరలోనే స్పెషల్​డ్రైవ్​చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా మేనేజర్ల నుంచి మొదలుకుని జీఎంల వరకు టార్గెట్​పెట్టనున్నారు. గతంలో వన్​టైమ్​సెటిల్​మెంట్​అమలు చేసినా ప్రయోజనం కలగలేదని ఈసారి ఓటీఎస్​కంటే నేరుగా నోటీసులతో ఒత్తిడి తేవాలని నిర్ణయించారు.