
- న్యాయం చేయాలని విదేశాంగ మంత్రికి బాధితురాలి తల్లి లేఖ
ఎల్బీనగర్, వెలుగు: పొట్ట కూటి కోసమని ట్రావెల్ ఏజెంట్ ద్వారా దుబాయ్‌కు వెళ్లిన హైదరాబాద్ యువతి చిక్కుల్లో పడింది. ఆమె వద్ద డ్రగ్స్పట్టుబడడంతో దుబాయ్పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. తన కుమార్తెకు ఏమీ తెలియదని, ట్రావెల్ ఏజెంటే ఆమెకు తెలియకుండా డ్రగ్స్‌తో ఉన్న బ్యాగ్ఇచ్చాడని విదేశాంగ మంత్రిని బాధితురాలి తల్లి ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. కిషన్ బాగ్‌కు చెందిన అమీనా బేగం(24)కు యూఏఈ బ్యూటీ పార్లర్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, నగరానికి చెందిన ఓ ట్రావెల్ ఏజెంట్ ఆమెను ఇదే ఏడాది మే18న దుబాయ్‌కు పంపించాడు.
అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఇమిగ్రేషన్ లో ఆమె బ్యాగ్ చెక్ చేయగా, అందులో డ్రగ్స్ బయటపడ్డాయి. దీంతో ఆమెను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే, తన బిడ్డను ట్రావెట్ ఏజెంట్ మోసం చేశాడని, ఆమెకు తెలియకుండా డ్రగ్స్ ఉన్న బ్యాగ్ఇచ్చాడని అమీనా తల్లి సుల్తానా బేగం పేర్కొంది.
తనకు కుమార్తెకు న్యాయం చేసి, విడిపించాలని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు ఆదివారం లేఖ రాసింది. అలాగే అమీనా తన కుటుంబాన్ని జైలు నుంచి సంప్రదించి, తాను నిర్దోషినని చెప్పింది. కాగా, ఈ ఘటనపై సెంట్రల్ ఇంటెలిజెన్స్ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అమీనాను దుబాయ్‌కు పంపిన ఏజెంట్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం బయటే అవకాశం ఉంది.