రష్యా–ఉక్రెయిన్ వార్లో చిక్కుకున్న హైదరాబాదీ

రష్యా–ఉక్రెయిన్ వార్లో చిక్కుకున్న హైదరాబాదీ
  •     కన్​స్ట్రక్షన్​ వర్క్​ చేయడానికి రష్యా వెళ్లిన ఎంఎస్​ మక్తా వాసి 
  •     నెల రోజుల తర్వాత రష్యా సైన్యానికి అప్పగించిన ఏజెంట్
  •     శిక్షణ ఇచ్చి యుద్ధానికి తీసుకెళ్లిన​ ఆర్మీ 
  •     కాలికి గాయమైనా యుద్ధం చేయాల్సిందేనని వార్నింగ్​ 
  •     సెల్ఫీ వీడియో తీసి పంపిన బాధితుడు  
  •     ఎంబసీ దృష్టికి తీసుకుకెళ్లిన ఎంపీ అసదుద్దీన్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఉపాధి కోసం రష్యా వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన 37 ఏండ్ల మహ్మద్ అహ్మద్ ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో బలవంతంగా పోరాడాల్సిన దుస్థితి ఎదురైంది. హైదరాబాద్​సిటీలోని ఎంఎస్​మక్తాకు చెందిన మహ్మద్​అహ్మద్..​ముంబైకి చెందిన ఏజెంట్ మాటలు నమ్మి ఈ ఏడాది ఏప్రిల్ 25న కన్​స్ట్రక్షన్​ వర్క్ ​చేయడానికి రష్యా వెళ్లాడు. అయితే, అక్కడికి చేరుకున్న తర్వాత దాదాపు నెలరోజుల పాటు పని ఇవ్వకుండా కూర్చోబెట్టారు. 

చివరికి అతడిని ఏజెంట్లు మోసం చేసి రష్యా సైన్యానికి అప్పగించారు. అహ్మద్‌తో పాటు మరో 30 మందికి రష్యా సైన్యం కొన్ని రోజుల పాటు సైనిక శిక్షణ ఇచ్చింది. ఆ తర్వాత, ఉక్రెయిన్‌తో యుద్ధం కోసం అహ్మద్‌తో సహా 26 మందిని సరిహద్దు ప్రాంతాలకు తరలించింది. ఈ క్రమంలో అహ్మద్ సైనిక వాహనం నుంచి దూకి కింద పడ్డాడు. దీంతో అతని కుడి కాలు విరిగింది. అతడు పోరాడటానికి నిరాకరించాడు. కానీ, ఉక్రెయిన్ సైన్యంతో పోరాడకపోతే చంపేస్తామని రష్యా ఆర్మీ అధికారులు బెదిరించారు.

సెల్ఫీ వీడియోతో వెలుగులోకి..

ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడానికి వెళ్లిన అహ్మద్.. అక్కడి పరిస్థితులను సెల్ఫీ వీడియోలో వివరించాడు. ‘‘నాతోపాటు శిక్షణ పొందిన 25 మందిలో 17 మంది చనిపోయారు. వారిలో ఒక ఇండియన్​కూడా ఉన్నాడు. మేం యుద్ధంలో పాల్గొనడానికి ఒప్పుకోలేదు. కానీ, వారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. నా కాలికి తీవ్ర గాయమైంది. కానీ, ప్లాస్టర్ వేసి సరిపెట్టారు. నేను నడవలేకపోతున్నా. నన్ను ఈ చిక్కుల్లో పడేసిన ఏజెంట్‌ను శిక్షించండి. ఉద్యోగం ముసుగులో నన్ను యుద్ధంలోకి లాగారు’’ అని వాపోయాడు. ఇది చూసిన అహ్మద్ భార్య గత వారం మజ్లీస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించి, తన భర్తను తిరిగి హైదరాబాద్‌కు తీసుకురావడానికి సహాయం చేయాలని అభ్యర్థించారు. 

అహ్మద్ తల్లి పక్షవాతంతో బాధపడుతోందని.. తాను, తన పది, నాలుగేండ్ల పిల్లలు అహ్మద్​పని చేస్తేనే బతికే స్థితిలో ఉన్నామని వేడుకున్నది. దీంతో ఒవైసీ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, రష్యాలోని భారత రాయబార కార్యాలయానికి వివరాలు పంపించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించి.. అహ్మద్ వివరాలను రష్యన్ అధికారులకు అందించింది. త్వరలోనే అహ్మద్ విడుదల అవుతాడని ఆశాభావం వ్యక్తం చేసింది.