జాగ్రత్తగా ఉండండి..కరోనాకు మందులు, టీకాలు రాలేదు

జాగ్రత్తగా ఉండండి..కరోనాకు మందులు, టీకాలు రాలేదు

హైదరాబాద్, వెలుగు:‘‘కరోనాకు మెడిసిన్ వచ్చేసింది. వ్యాక్సిన్ కూడా త్వరలో రాబోతోంది. ఇంకేంటీ? నాకు కరోనా వచ్చినా పర్వాలేదు..’’ ప్రస్తుతం చాలామంది జనం ఇలాగే అనుకుంటున్నారు. అయితే, కరోనా విషయంలో అప్పుడే రిలాక్స్ అయిపోవద్దని డాక్టర్లు మాత్రం వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతవరకు కరోనాకు మెడిసిన్, వ్యాక్సిన్స్ రాలేదంటున్నారు. ప్రస్తుత సిచువేషన్ లో మాస్కులు తీసేసి రిలాక్స్ కావడం ఏమాత్రం మంచిది కాదని చెప్తున్నారు. కరోనాకు మందులు వచ్చాయన్న ప్రచారం కొన్ని రోజులుగా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ విషయంపై డాక్టర్ వేద ప్రకాశ్ ‘వీ6’ ప్రతినిధితో మాట్లాడారు.

ఆ మందు ఎక్కడా ప్రూవ్ కాలే..

ఇటీవల గ్లెన్ మార్క్ కంపెనీ ఫావిపిరావిర్ అనే కరోనా మందును విడుదల చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ మందు కరోనా వైరస్ కు బాగా పని చేస్తుందని ఎక్కడా ప్రూవ్ కాలేదని డాక్టర్ వేద ప్రకాశ్ స్పష్టంచేశారు. దీనిపై ఏ దేశంలోనూ వ్యాలిడేటెడట్ స్టడీ జరగలేదని ఆయన తెలిపారు. అది జపాన్ లో నార్మల్ ఫ్లూకోసం వాడుతున్న మందు అని, మైల్డ్ కేసెస్ లో ఫ్లూ సింప్టమ్స్ ను తగ్గించడానికే అది పనికొస్తుందన్నారు. సీరియస్ కరోనా కేసెస్ లో అది పనికి రాదన్నారు. హెటిరో నుంచి వస్తున్న రెమ్డెసివిర్ మందు మాత్రం సివియర్ కరోనా కేసెస్ లో కొంత ఎఫెక్ట్ చూపించొచ్చని ఆయన వెల్లడించారు. ఇక మూడోదైన డెక్సమిథసోన్ మందు ఆక్సిజన్, వెంటిలేటర్ పై ఉన్న కరోనా పేషెంట్లలో 6వ వంతు వ్యక్తులపై మాత్రమే కొంత ఎఫెక్ట్ చూపించవచ్చని డాక్టర్ వేద ప్రకాశ్ చెప్పారు. దీనిపై ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతుందన్నారు. కరోనాకు టీకా కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదన్నారు. ఫాస్ట్ ట్రాకింగ్ లో చేసినా టీకా తయారీకి కనీసం 6 నెలలు అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా దాని సరఫరాకు మరింత టైం పడుతుందన్నారు. మొత్తంగా అక్టోబర్, నవంబర్ వరకూ కరోనాకు టీకా వచ్చే చాన్స్ లేదని ఆయన చెప్పారు.

ప్రస్తుతానికి మాస్కులే టీకాలు..

కరోనాకు మందులు, టీకాలు లేనందున.. ప్రస్తుతానికి మాస్కులు పెట్టుకోవడం, డిస్టెన్స్ పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడమే వ్యాక్సిన్ గా భావించాలని వేద ప్రకాశ్ చెప్పారు. మాస్కును ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా పెట్టుకోవాలని, ఇతరులతో మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ఉండాలన్నారు. అలాగే, చేతులు తరచూ కడుక్కోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా కీలకమని చెప్పారు. మనకేం జరగదులే అనే ధోరణిలో ఉండొద్దని సూచించారు. మనదేశంలోని వైరస్ తక్కువ శక్తివంతమని, మనకు ఇమ్యూనిటీ ఎక్కువన్న అపోహలో ఉండొద్దన్నారు.

 

రోజుకో రికార్డ్..పెరుగుతున్న కరోనా కేసులు