జైపూర్: ఐపీఎల్–19లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి మెరిశారు. ఇషాన్ కిషన్ (31 బాల్స్‌లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74), అభిషేక్ శర్మ (29 బాల్స్‌లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 57) మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకోగా.. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్5 వికెట్ల తేడాతో రాజస్తాన్ రాయల్స్‌కు చెక్ పెట్టింది. దాంతో ఎస్‌ఆర్‌హెచ్ వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడిన రాజస్తాన్ 20 ఓవర్లలో 228/6 స్కోరు చేసింది. వైభవ్ సూర్యవంశీ (37 బాల్స్‌లో 5 ఫోర్లు, 12 సిక్స్‌లతో 103), ధ్రువ్ జురెల్ (51) చెలరేగారు. తర్వాత హైదరాబాద్ 18.3 ఓవర్లలో 229/5 స్కోరు చేసింది. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
వైభవ్ అదరహో..
వండర్ కిడ్ వైభవ్ తొలి ఓవర్‌లోనే వరుసగా నాలుగు సిక్స్‌లతో 25 రన్స్‌తో మొదలుపెట్టిన పరుగుల మోత 13.5 ఓవర్ల వరకు స్వేచ్ఛగా సాగింది. వైభవ్‌ను కట్టడి చేసేందుకు హైదరాబాద్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు. రెండు ఫోర్లు కొట్టి జైస్వాల్ (10) ఔటైనా.. వైభవ్ సిక్సర్ల జాతర మాత్రం ఆగలేదు. వన్‌డౌన్‌లో ధ్రువ్ జురెల్ ఫోర్లు దంచడంతో రన్‌రేట్ పరుగెత్తింది.
రెండు భారీ సిక్స్‌లతో వైభవ్ 15 బాల్స్‌లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఫలితంగా రాజస్తాన్ 76/1తో పవర్‌ప్లేను ముగించింది. ఏడో ఓవర్‌లో జురెల్ 4, వైభవ్ 6, 4 కొట్టారు. తర్వాత కమిన్స్, షకీబ్ రన్స్ కట్టడి చేయడంతో తర్వాతి నాలుగు ఓవర్లలో 36 రన్సే వచ్చాయి. 11, 12వ ఓవర్‌లో జురెల్ 6, 4, 4, వైభవ్ 4, 6తో జోరు పెంచారు. ఈ క్రమంలో జురెల్ 34 బాల్స్‌లో హాఫ్ మార్క్ అందుకున్నాడు.
కానీ 13వ ఓవర్‌లో నితీశ్ రెడ్డి (1/20)కి వికెట్ ఇవ్వడంతో రెండో వికెట్‌కు 112 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. 14వ ఓవర్‌లో వైభవ్ 6, 4,తో 36 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ వెంటనే షకీబ్ బాల్‌ను అడ్డంగా ఆడబోయి ఎల్బీ అయ్యాడు. ఈ దశలో రియాన్ పరాగ్ (7) ఫెయిలైనా, ఫెరీరా (33) మెరుగ్గా ఆడే ప్రయత్నం చేశాడు.
17వ ఓవర్‌లో పరాగ్ వెనుదిరగగా.. 18వ ఓవర్‌లో ఫెరీరా 6, 4, 6తో 18 రన్స్ చేసి తర్వాతి ఓవర్‌లో వికెట్ ఇచ్చుకున్నాడు. చివర్లో వరుస విరామాల్లో ఫెరీరా, హెట్‌మయర్ (11) ఔటైనా రాజస్తాన్ మంచి టార్గెట్‌నే నిర్దేశించింది.
కీలక భాగస్వామ్యం..
ఛేజింగ్‌లో తొలి బాల్‌కు క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న హెడ్ (6) సిక్స్ కొట్టి ఐదో బాల్‌కే వెనుదిరిగాడు. ఇషాన్ సిక్స్‌తో ఖాతా ప్రారంభించగా, అభిషేక్ రెండు ఫోర్లతో మొదలుపెట్టాడు. థర్డ్ ఓవర్‌లో ఇషాన్ మూడు ఫోర్లతో జోరు పెంచగా, నాలుగో ఓవర్‌లో అభిషేక్ 6, 4, 6, 4, 4తో 19 రన్స్ రాబట్టి మరో మెట్టు ఎక్కించాడు. తర్వాతి రెండు ఓవర్లలో ఏడు ఫోర్లు రావడంతో పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 89/1 స్కోరు చేసింది.
ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత కూడా ఈ ఇద్దరు బౌండ్రీల మోత ఆపలేదు. ఈ క్రమంలో అభిషేక్, ఇషాన్ చెరో 24 బాల్స్‌లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. కానీ ఆఖరి బాల్‌కు అభిషేక్ ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 132 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. నాలుగు ఓవర్లలో 50 రన్స్ రావడంతో ఫస్ట్ టెన్‌లో హైదరాబాద్ 139/2 స్కోరు చేసింది.
11వ ఓవర్‌లో ఇషాన్ 4, 6, 4 కొట్టి 13వ ఓవర్‌లో వెనుదిరిగాడు. మధ్యలో క్లాసెన్ (29), నితీశ్ రెడ్డి (36) దూకుడుగా ఆడటంతో 15 ఓవర్లలో స్కోరు 188/3కి పెరిగింది. ఇక చివరి 30 బాల్స్‌లో 41 రన్స్ అవసరం కాగా వరుస విరామాల్లో నితీశ్, క్లాసెన్ ఔటైనా.. సలీల్ (8 నాటౌట్), అనికేత్ (1 నాటౌట్) 9 బాల్స్ మిగిలి ఉండగానే విజయాన్ని అందించారు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్తాన్: 20 ఓవర్లలో 228/6 (వైభవ్ 103, జురెల్ 51, ఈషాన్ మలింగ 2/38).
హైదరాబాద్: 18.3 ఓవర్లలో 229/5 (ఇషాన్ 74, అభిషేక్ 57, ఆర్చర్ 2/34).
ఐపీఎల్‌లో మూడో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన వైభవ్ (35 బాల్స్). గేల్ (30) ముందున్నాడు.
ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు కొట్టిన తొలి ప్లేయర్ వైభవ్ (15 ఇన్నింగ్స్). గేల్ (21) రికార్డును బ్రేక్ చేశాడు.

