- 26న ప్రదానం చేయనున్న కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్
న్యూఢిల్లీ, వెలుగు: పశువులు, పాడి పరిశ్రమల రంగంలో అందించిన ఉత్తమ సేవలకు హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కంకణాల కృష్ణారెడ్డికి ప్రతిష్టాత్మకమైన ‘జాతీయ గోపాల రత్న’ అవార్డు దక్కింది. ఈ మేరకు సోమవారం కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ జాతీయ గోపాల రత్న–2025 (ఎన్‌జీఆర్‌ఏ) అవార్డులను ప్రకటించింది.
దేశీయ పశువులు, గేదె జాతుల పెంపకంలో ఉత్తమ పాడి రైతు కేటగిరీ కింద నాన్– ఎన్‌ఈఆర్ (ఈశాన్య ప్రాంతం కాని) విభాగంలో కృష్ణా రెడ్డికి రెండో ర్యాంక్ దక్కింది. ఈ నెల 26న జాతీయ పాల దినోత్సవం రోజున ఢిల్లీలో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ విజేతలకు అవార్డులు అందజేయనున్నట్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
