భళా.. ఇండీ పప్పీ దత్తత మేళా!

భళా.. ఇండీ పప్పీ దత్తత మేళా!
  • వెంగళరావు పార్కు లో తొలిసారిగా 
  •   స్ట్రీట్​డాగ్స్​ అడాప్షన్​ ప్రోగ్రామ్​ 
  • 39 కుక్కపిల్లల్లో 24 డాగ్స్ ను 
  •   దత్తత తీసుకున్న డాగ్ లవర్స్ 

 హైదరాబాద్ సిటీ, వెలుగు : స్ట్రీట్ డాగ్స్ దత్తత కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఆదివారం ప్రారంభించింది. ‘బీ ఏ హీరో అడాప్ట్.. డోంట్ షాప్’  అనే నినాదంతో బంజారాహిల్స్ లోని జలగం వెంగళరావు పార్కు లో తొలిసారిగా ఇండీ పప్పీ దత్తత మేళాను స్టార్ట్ చేసింది. ఈ కార్యక్రమాన్ని జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తో కమిషనర్​ఆర్వీ కర్ణన్​ప్రారంభించారు. ఎన్జీవో లు, డాగ్ లవర్స్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు తీసుకువచ్చిన 39 కుక్క పిల్లలను ఈ ప్రదర్శనలో ఉంచగా, 24 కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. కమిషనర్ కర్ణన్​మాట్లాడుతూ దేశీ కుక్కపిల్లలను దత్తత తీసుకున్న ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానన్నారు. 

2 నెలల పిల్లలే దత్తతకు ..

2 నెలల వరకు పిల్లలు తల్లిపాలు తాగుతాయి కాబట్టి ఆ తర్వాతే వాటిని చేరదీసి దత్తతకు ఇస్తున్నామని బల్దియా వెటర్నరీ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి15 రోజులకోసారి వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కుక్కకాట్లతో పాటు వాటి జనాభాను తగ్గించేందుకు ఈ ప్రోగ్రామ్​దోహదపడుతుందన్నారు. వీధుల్లో తిరిగే కుక్కలకు ఆహారం లభించక దాడులు చేస్తున్నాయని, దత్తత ఇవ్వడంతో ఆ సమస్యకు చెక్ పడుతుందన్నారు.

దత్తతకు తీసుకునే వారి వివరాలను తీసుకుని, రెగ్యులర్​గా ఫాలో అప్​చేస్తామని చెప్పారు. ఆరు నెలల తర్వాత స్టెరిలైజేషన్ కూడా చేస్తామన్నారు. కుక్కపిల్లలను  అందజేసే ముందు డీ–వార్మ్‌‌‌‌ చేసి వ్యాక్సిన్‌‌‌‌ వేసి అందజేస్తున్నామని చెప్పారు.  జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్‌‌‌‌, అధికారులు  పాల్గొన్నారు.