- ఎల్లారెడ్డిగూడ, ఎస్ఆర్ నగర్హాస్టళ్లలో హైడ్రా చీఫ్ తనిఖీ
- రూల్స్ పాటించాలని ఆదేశం
- హైడ్రా ఆఫీసులో నిర్వాహకులకు అవగాహన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఫైర్ సేఫ్టీ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని హాస్టళ్ల నిర్వాహకులకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. నగరంలో హాస్టళ్లు ఫైర్ సేఫ్టీ రూల్స్పాటించడం లేదని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో మంగళవారం హైడ్రా ఆఫీసులో హాస్టళ్ల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు హైడ్రా అధికారులతో కలిసి ఎల్లారెడ్డిగూడ, సంజీవరెడ్డినగర్ ప్రాంతాల్లోని మూడు హాస్టళ్లను కమిషనర్ చెక్ చేశారు. చిన్న గదుల్లో స్థాయికి మించి బెడ్లు ఏర్పాటు చేయడం, ఫైర్ సేఫ్టీ రూల్స్పాటించకపోవడం గుర్తించారు. సెల్లార్లలో మెస్‌లు ఏర్పాటు చేయడం, భద్రత కోసం వేసిన ఏర్పాటు చేసిన గ్రిల్స్‌కు తాళాలు వేసి ఉండడం చూసి అవాక్కయ్యారు.
ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేకపోవడాన్ని గమనించారు. నాలుగైదు అంతస్తులున్న హాస్టల్స్భవనాల్లో పొరపాటున అగ్ని ప్రమాదం జరిగితే భారీ నష్టం జరుగుతుందన్నారు. ప్రతి గదిలో ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, స్మోక్ డిటెక్టర్లు పెట్టాలని, రెండో స్టెయిర్‌కేస్(మెట్ల మార్గం)కు అవకాశం ఉంటే ఏర్పాటు చేయాలని, లేకపోతే నిచ్చెనలతో కిందకు దిగేలా ఏర్పాట్లుచేయాలన్నారు. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య, ఆర్ ఎఫ్‌వో జయప్రకాష్, డీఫ్‌వోలు యజ్ఞ నారాయణ, సైబరాబాద్ హాస్టళ్ల యజమానుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు అమర్‌నాథ్ రెడ్డి, కరుణాకర్ తో పాటు హాస్టళ్ల నిర్వాహకులు పాల్గొన్నారు.
