కాల్వలపై స్లాబులతో పూడిక తీయరాకనే వరద : హైడ్రా చీఫ్ రంగనాథ్

కాల్వలపై స్లాబులతో పూడిక తీయరాకనే వరద : హైడ్రా చీఫ్ రంగనాథ్
  •     హైడ్రా చీఫ్ ​రంగనాథ్
  •     కొండాపూర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటన  

హైదరాబాద్ సిటీ, వెలుగు: కాలువల్లో పూడిక, కాలువలపై నిర్మించిన స్లాబులు తెర లేకుండా ఉండడమే వరదలకు కారణమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. సోమవారం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్, జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులతో కలిసి కొండాపూర్ జూబ్లీ గార్డెన్స్, శంషాబాద్, అత్తాపూర్, రామ్‌‌‌‌దేవ్‌‌‌‌బాబా నగర్ ప్రాంతాల్లో వరద ముప్పు పరిస్థితులను పరిశీలించారు. కాలువలపై వందల మీటర్ల మేర స్లాబులు వేసి పూర్తిగా మూసివేయడంతో డీ-సిల్టింగ్ పనులు జరగక సమస్య వస్తోందని గుర్తించారు. 

ప్రతి మూడు మీటర్లకు ఓపెన్ చేసే సదుపాయం ఉండాలని అధికారులు నిర్ణయించారు. కొండాపూర్ జూబ్లీ గార్డెన్స్ ప్రాంతంలో శనివారం నుంచి కాలువలపై ఉన్న స్లాబులను తొలగించి పూడిక తొలగింపు పనులు చేపట్టామని, మీనాక్షి అపార్ట్‌‌‌‌మెంట్స్ సమీపంలో 2.15 మీటర్ల వెడల్పుతో ఉండాల్సిన వరద కాలువ సుమారు 1.5 మీటర్లకు కుచించుకుపోవడం, పైప్‌‌‌‌లైన్ ఏర్పాటు చేయడం వల్ల నీటి ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకున్నారు.  

శంషాబాద్, రామ్‌‌‌‌దేవ్‌‌‌‌బాబా నగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో కూడా వరద నిలిచిపోవడానికి ప్రధాన కారణం కాలువలు, ఇన్‌‌‌‌లెట్లు పూడుకుపోవడమేనని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అవసరమైన చోట్ల స్లాబులను తొలగించి పూర్తిస్థాయి డీ-సిల్టింగ్ చేపట్టాలని కమిషనర్ రంగనాథ్ ఆదేశించారు. పనులు పూర్తయిన తర్వాత ఓపెన్ నాలాలపై గ్రిల్స్ ఏర్పాటు చేయాలన్నారు. వారంలో తిరిగి పరిశీలనకు వస్తామని, శాశ్వత పరిష్కార చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు.