
- ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చామన్న కమిషనర్
- ఒవైసీ కుటుంబానికి సన్నిహితుడి నుంచి 25 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఒవైసీ ఫాతిమా కాలేజీ పై క్లారిటీ ఇచ్చినా మళ్లీ ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని సోషల్ మీడియా తదితర మాధ్యమల్లో హైడ్రాని ప్రశ్నిస్తుండడంతో మరోసారి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. సల్కం చెరువు ఎఫ్టీఎల్ లో నిర్మించిన ఫాతిమా కాలేజ్ తొలగిస్తామని గత సెప్టెంబర్ లో ప్రకటించామని, అయితే పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థ ఇక్కడ నడుస్తోందన్నారు. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరని, 10 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే సామాజిక కోణంలో ఆలోచించి చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు.
ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నామన్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేసామని, 25 ఎకరాల చెరువును ఫ్లాట్లుగా మార్చిన ఓవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశామన్నారు. ఎంఐఎం లీడర్ల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేశామన్నారు. చంద్రాయణగుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ కబ్జా చేసిన స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
నాలాను మోడల్ గా తీర్చిదిద్దుతాం
మాసం చెరువు, దిలావర్ఖాన్, - పెద్దఅంబర్ పేట్ చెరువులను అనుసంధానం చేసే నాలాను మోడల్ గా తీర్చిదిద్దుతామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొత్తం 7.50 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ నాలాను తగిన వెడల్పుతో నిర్మిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవన్నారు. మాసబ్ చెరువు–దిలావర్ఖాన్చెరువుల మధ్య నాలా సరిగ్గా లేక అనేక కాలనీలు నీట మునుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తో కలిసి పలు ప్రాంతాలను బుధవారం రంగనాథ్పరిశీలించారు.
మాసబ్ చెరువు–- దిలావర్ఖాన్చెరువుల మధ్య జాలికుంట పరిసరాల్లో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చూశారు. జాలికుంటలో కట్టడం వల్ల సెల్లార్లోకి నీళ్లు చేరడంతో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించారు. చెరువులలో మట్టిపోసి నింపినవారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కర్మన్ ఘాట్, బడంగ్ పేట ఏరియాల్లో నాలా విస్తరణకు ఉన్న ఆటంకాలను పరిశీలించారు. కర్మన్ ఘాట్ ప్రాంతంలోని ఉదయ నగర్ కాలనీలో నాలా విస్తరణ వెంటనే చేపట్టాలని సూచించారు. అలాగే రావిర్యాల చెరువును పరిశీలించారు. చెరువు పైభాగంలో నివాసాలు నీట మునుగుతున్న నేపథ్యంలో చెరువు అలుగులను పరిశీలించారు.
నాలా పనులు వెంటనే పూర్తి చేయాలి
ముషీరాబాద్ లోని నాగమయ్య కుంట నుంచి పద్మారావు నగర్ వరకు చేపట్టిన నాలా పనులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం పరిశీలించారు. స్ట్రాటజిక్నాలా డెవలప్ మెంట్ ప్లాన్(ఎస్ ఎన్ డీపీ) ద్వారా చేపట్టిన నాలా పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అందుకు కావాల్సిన నిధుల కోసం ప్రతిపాదనలు పంపాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఓపెన్ నాలా పై స్లాబ్ పనులు చేపట్టాలన్నారు. వర్షాలు పడేప్పుడు, నీళ్లు నిలిచినప్పుడు, రోడ్ల రిపేర్ల టైంలో హెచ్చరిక బోర్డులు పెట్టాలన్నారు. బోర్డులు లేని ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగితే సంబంధిత ఇంజినీర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.