- పునరుద్ధరణకు కృషి చేస్తున్నం: హైడ్రా కమిషనర్
- వరదలు ఆపడానికి కావాల్సినవి చెరువులే
- సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్‌లో వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో దాదాపు 61 శాతం చెరువులు కనుమరుగయ్యాయని, వాటిని వీలైనంతవరకు పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. కార్పొరేట్ సంస్థలు కూడా ఇందుకోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బుధవారం శిల్పకళావేదికలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం నిర్వహించిన సౌత్ ఇండియా సీఎస్ఆర్ సమ్మిట్‌లో రంగనాథ్ పాల్గొని మాట్లాడారు.
అభివృద్ధి అంటే అందాలు అద్దడం కాదు..
చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్దడం ఒక్కటే కాదని, దాని అవసరాలు నెరవేరే విధంగా తీర్చిదిద్దాల్సి ఉంటుందన్నారు. చెరువుల్లో ఆక్రమణలు, పోసిన మట్టితో పాటు కొన్నేళ్లుగా పేరుకుపోయిన పూడిక, దుర్గంధాన్ని తొలగించిన తర్వాత మిగతా ఆకర్షణలపై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ) కింద చెరువులను అభివృద్ధి చేస్తున్నవారు ఈ విషయాలపై దృష్టి పెట్టాలన్నారు. చెరువుల పునరుద్ధరణను హైడ్రా ఎలా చేపట్టిందనేది విషయాన్ని వివరిస్తూ రంగనాథ్పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటతో పాటు సిటీలో మొదటి విడతగా చేపట్టిన ఆరు చెరువుల పునరుద్ధరణ గురించి వివరించారు. చెరువుల్లో వరద నిలిచేలా లోతు పెంచాల్సినవసరం ఉందని, అలాగే ఇన్లెట్లు, ఔట్లెట్లు సరిగ్గా ఉండేలా చూడాలన్నారు. గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే నగరంలో వరదలను నివారించగలమన్నారు. ఎకరం పరిధిలో మీటరు లోతులో నాలుగు మిలియన్ లీటర్ల నీటిని ఆపగలమని, ఈ లెక్కన వరదలను నివారించడానికి చెరువులు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీఎస్ ఆర్ సమ్మిట్ ముఖ్య ఉద్దేశాలను ప్రొఫెసర్ కోదండరామ్ వివరించారు. కార్యక్రమంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఖైరతాబాద్ చైర్మన్ రమణ నాయక్ పాల్గొన్నారు.
