అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి పంజా విసురుతోంది. ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా ఆమీన్ పూర్ మున్సిపల్ పీజేఆర్ కాలనీ, మియాపూర్ సరిహద్దు ప్రాంతంలో నవంబర్ 1న ఉదయం అమీన్ పూర్, చందానగర్ బార్డర్ పరిధి ప్రాంతాల్లో భారీ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా.. మియాపూర్ లోని 101 సర్వే నెంబర్ లో సర్వే నంబర్ మార్చి భారీ అక్రమ నిర్మాణం చేపట్టినట్లు గుర్తించింది. అమీన్ పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400 గజాల ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 లోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్.. మొత్తం దాదాపు 873 గజాల్లో 5 అంతస్తుల భవనం నిర్మించారు. విచారణ చేసి అక్రమ నిర్మాణంగా తేలడంతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా భారీగా మోహరించారు పోలీసులు.
ALSO READ : హైడ్రా కమిషనర్ హాజరుకావాల్సిందే
ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పడిన హైడ్రా అక్టోబర్ 31న పోచారంలో రూ. 30 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడింది . పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో 4 వేల గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రకు ఫిర్యాదు చేశారు స్థానికులు. పార్కు స్థలంలో లేఔట్ వేసినవారే కబ్జాకు పాల్పడినట్లు గుర్తించింది హైడ్రా. తప్పుడు డాక్యుమెంట్స్ తో ఆముదాల రమేష్ అనే వ్యక్తి 4 వేల గజాలను 800 గజాల చొప్పున 5 ప్లాట్లుగా కులకర్ణి అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించింది హైడ్రా. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా ఆక్రమణల కూల్చివేతలు చేపట్టింది. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు
