మేడ్చల్: మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయంజాల్లో హైడ్రా కూల్చివేతలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. దేవరయంజల్లో నాలా కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మాణం చేయడంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దేవరయంజాల్లోని పలు కాలనీలు నీట మునిగాయి. దీంతో.. బాధితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా అధికారులు మంగళవారం రంగంలోకి దిగి నాలాపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు రాగా, ఇందులో ఎక్కువ ఫిర్యాదులు కబ్జాలకే సంబంధించనవే.
హస్మత్‌పేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. శంషాబాద్ మండలంలోని పెద్ద గోల్కొండ గ్రామ పరిధిలోని సరసింహకుంట తూములు మూసేసి.. అలుగు ఎత్తు పెంచడం వల్ల ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి పంట పొలాలు మునిగిపోయాయని ఆ గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. చెరువు స్థాయికి మించి నిండడంతో నీరు ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 15 వద్ద సర్వీసు రోడ్డును ముంచెత్తుతోందని, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాకు గురవుతుందోని కంప్లయింట్ వచ్చింది. సాగర్ రోడ్డులో ఉన్న యశోదనగర్ కాలనీలో రోడ్డును కలిపేసుకుని దారి లేకుండా చేస్తున్నారని యశోదనగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
మరో రోడ్డును ఆక్రమించి 107 గజాల ప్లాట్ స్థలంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం హస్మత్‌పేట గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఓల్డ్ బోయిన్‌పల్లి నివాసులు ఫిర్యాదు చేశారు. 28.28 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులతో పాటు వారి అనుచరులు ఈ భూమిని వెంచర్‌గా చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారని ఆరోపించారు.
