కబ్జా భూములు కాపాడండి సారూ!.. కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు

కబ్జా భూములు కాపాడండి సారూ!.. కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు
  • కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదులు
  • ప్రజావాణికి 52 కంప్లయింట్స్

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రా ఆఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్  ఏవీ రంగ‌నాథ్‌ ప‌రిశీలించి సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్యత‌ల‌ను అప్పజెప్పారు. హ‌స్మత్‌పేటలో 10 ఎక‌రాల ప్రభుత్వ భూమిని క‌బ్జా చేస్తున్నారంటూ ఫిర్యాదు అందింది. శంషాబాద్ మండ‌లంలోని పెద్ద గోల్కొండ గ్రామ ప‌రిధిలోని స‌ర‌సింహ‌కుంట తూములు మూసేసి.. అలుగు ఎత్తు పెంచ‌డం వ‌ల్ల ఎఫ్‌టీఎల్ కంటే ఎక్కువ నీరు నిలిచి పంట పొలాలు మునిగిపోయాయ‌ని ఆ గ్రామ ప్రజ‌లు ఫిర్యాదు చేశారు.

 చెరువు స్థాయికి మించి నిండ‌డంతో నీరు ఔట‌ర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 15 వ‌ద్ద స‌ర్వీసు రోడ్డును ముంచెత్తుతోంద‌ని, రాక‌పోక‌ల‌కు ఇబ్బంది క‌లుగుతోంద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట కబ్జాకు గురవుతుందోని కంప్లయింట్​ వచ్చింది. సాగర్ రోడ్డులో ఉన్న య‌శోద‌న‌గ‌ర్ కాల‌నీలో రోడ్డును క‌లిపేసుకుని దారి లేకుండా చేస్తున్నార‌ని య‌శోద‌న‌గ‌ర్ కాల‌నీ రెసిడెంట్స్ అసోసియేష‌న్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. 

మ‌రో రోడ్డును ఆక్రమించి 107 గ‌జాల ప్లాట్ స్థలంగా చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం హస్మత్‌పేట గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణల‌పై ఓల్డ్ బోయిన్‌పల్లి నివాసులు ఫిర్యాదు చేశారు. 28.28 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు పేర్కొన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయ‌కుల‌తో పాటు వారి అనుచరులు ఈ భూమిని వెంచర్‌గా చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నార‌ని ఆరోపించారు.

వికారాబాద్ కలెక్టరేట్​కు 106 అర్జీలు..

వికారాబాద్: ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలని వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్ లింగ్యానాయక్  అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించగా ఆయన 106 దరఖాస్తులు స్వీకరించారు. అడిషనల్​ కలెక్టర్ సుధీర్, డీఆర్వో మంగీలాల్, ఆర్డీవో వాసుచంద్ర పాల్గొన్నారు. 

రంగారెడ్డిలో 56..

రంగారెడ్డి కలెక్టరేట్: రంగారెడ్డి కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 56 అర్జీలు వచ్చాయి. వాటిని అడిషనల్​ కలెక్టర్​ చంద్రారెడ్డి స్వీకరించారు. డీఆర్వో సంగీత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.