
హైదరాబాద్ సిటీ, వెలుగు: మధురానగర్‌లో రహదారి మధ్యలో ఉన్న రైలింగ్‌ను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో ఈ ప్రాంతంలో ఓపెన్‌గా ఉన్న వరద నీటి కాలువను బాక్స్ డ్రైయిన్ గా నిర్మించి దానిపై స్లాబ్ వేసి రైలింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ రైలింగ్.. ట్రాఫిక్‌కు అంతరాయంగా మారింది. ఈ ఇబ్బందిపై కాలనీ వాసులు ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. పార్కింగ్తో ఇరుకుగా మారిన రోడ్డు ఫొటోలతో సహా అధికారులకు చూపించారు.
ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో సమస్యలను గమనించారు. స్లాబ్ పటిష్టంగా ఉందని నిర్ధారించుకుని, 5 అడుగుల వెడల్పుతో 900 మీటర్ల మేర ఉన్న రైలింగ్‌ను ఆదివారం తొలగించారు. దీంతో ఇక్కడ రోడ్డు వెడల్పు పెరగడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. ఈ పనులు చేసిన హైడ్రాను స్థానికులు అభినందించారు. హైడ్రాని ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఫొటోకి క్షీరాభిషేకం చేశారు.