రాత్రంతా మూసీలోనే చావుతో పోరాటం...మహిళను కాపాడిన హైడ్రా

రాత్రంతా మూసీలోనే చావుతో పోరాటం...మహిళను కాపాడిన హైడ్రా

అంబర్​పేట్, వెలుగు:  ప్రమాదవశాత్తు మూసీ నదిలో పడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను హైడ్రా కాపాడింది. అంబర్​పేట గోల్నాక పరిధిలోని భాగ్యనగర్ ప్రాంతానికి చెందిన ఇందిర (49) శుక్రవారం రాత్రి నది ఒడ్డున నడుస్తుండగా, ప్రమాదవశాత్తు జారి మూసీలో పడిపోయింది. రాత్రంతా నదిలోని చెట్ల పొదల్లో చిక్కుకుని భయంభయంగా గడిపింది. కేకలు వేసినా ఎవరికీ వినపడలేదు. 

శనివారం ఉదయం 10 గంటల తర్వాత స్థానికులు గుర్తించి, హైడ్రా కంట్రోల్ రూమ్​(90001 13667) సమాచారం అందించారు. వెంటనే స్పందించిన డీఆర్‌‌ఎఫ్ రిస్క్ ఇన్​చార్జి స్వామి నేతృత్వంలోని 16 మంది సభ్యుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ సిబ్బంది సహకారంతో పెద్ద నిచ్చెన ద్వారా నదిలోకి దిగి, సుమారు 12 గంటల పాటు నదిలో చిక్కుకున్న ఇందిరను సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.