నివాసమున్న ఇండ్ల జోలికి రాం.. నిర్వాసితులు ఆందోళన చెందవద్దు : హైడ్రా

నివాసమున్న ఇండ్ల జోలికి రాం.. నిర్వాసితులు ఆందోళన చెందవద్దు : హైడ్రా

మియాపూర్‌‌, వెలుగు: మియాపూర్​ పరిధిలోని వివాదాస్పద సర్వే నంబర్‌‌ 44లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అక్కడ ఇప్పటికే నివాసం ఉంటున్న ప్రజల జోలికి తాము రామని హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. తప్పుడు పత్రాలు సృష్టించి వాణిజ్య సముదాయాలు నిర్మించిన ఆక్రమణదారులపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

మియాపూర్​ పరిధిలోని సర్వే నంబర్‌‌ 44లో మొత్తం 260.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. తప్పుడు పత్రాలతో ఎకరాల కొద్దీ ఆక్రమణలు చేసిన వారు, తమ అక్రమ నిర్మాణాలను కాపాడుకునేందుకు నిర్వాసితులను ఉసిగొల్పుతున్నారని చెప్పారు. ఆక్రమణలను అడ్డుకునేందుకే తాము ఫెన్సింగ్‌‌ వేస్తున్నామని స్పష్టం చేశారు.

145 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌‌ పూర్తి..

తప్పుడు పత్రాలతో సర్వే నంబర్‌‌ 44లో రిజిస్ట్రేషన్లు జరిగిన వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌‌గా తీసుకుని, సంబంధిత సబ్‌‌ రిజిస్ట్రార్‌‌ను సస్పెండ్‌‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇప్పటికే బీకే ఎన్‌‌క్లేవ్‌‌ చెరువు పక్కన ఉన్న 5 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌‌ పూర్తి చేయగా, తాజాగా రెండు రోజుల్లో మరో 15 ఎకరాల భూమికి ఫెన్సింగ్‌‌ వేసింది. కొందరు ఆక్రమణదారులు దుకాణాలు, షోరూంలను కబ్జా భూమిని అద్దెకు ఇచ్చి నెలకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారని, తమ అక్రమాలను కాపాడుకునేందుకు నిర్వాసితులను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు.