
బంజారా హిల్స్.. హైదరాబాద్ లో రిచెస్ట్ ఏరియా అంటే జూబ్లీ హిల్స్ తర్వాత వినపడే పేరు. సిటీలో ల్యాండ్ వాల్యూ కోట్లలో పలికే ఏరియాల లిస్టులో బంజారా హిల్స్ టాప్ లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఏరియాలో కొన్ని గజాలు భూమి మనదైతే.. కళ్ళు మూసుకొని బతికేయచ్చు అనుకునేవారు చాలా మంది ఉంటారు. అలా అనుకున్న ఓ వ్యక్తి బంజారాహిల్స్ లోని ప్రభుత్వ భూమిపై కన్నేశాడు. ఏకంగా ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు.. కబ్జా చేయడమే కాకుండా భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి.. బౌన్సర్లు, అడవి కుక్కలతో కాపలా పెట్టాడు. హైడ్రా కూల్చివవేతలతో బాగోతం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
బంజారాహిల్స్ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఉన్న ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు పార్థసారథి అనే వ్యక్తి. ఆ ఐదెకరాల ప్రభుత్వ భూమి తనదేనంటూ కోర్టుకెక్కాడు పార్థసారథి. భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన పార్థసారథి వేట కుక్కలు, బౌన్సర్లతో కాపలా కూడా పెట్టాడు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్లు నిర్మించాడు పార్థసారథి. ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు స్థానికులు.
ప్రభుత్వం సదరు ఐదు ఎకరాల భూమిలో 1.20 ఎకరాలను జలమండలికి కేటాయించడం గమనార్హం. అనేక ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి ప్రయత్నాలను అడ్డుకున్నాడు పార్థసారథి. అతని నిర్వాకంపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు, జలమండలి అధికారులు. అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా ఫేక్ సర్వే నంబర్ (403/52) తో పార్థసారథి ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేస్తున్నాడని గుర్తించింది.
పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదు చేశారు రెవెన్యూ, జలమండలి అధికారులు. 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్టు తెలిపింది హైడ్రా. అన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు నిర్దారించుకున్నట్లు తెలిపారు హైడ్రా అధికారులు.
ఈ క్రమంలో షేక్ పేట్ రెవెన్యూ అధికారుల లేఖ మేరకు ఇవాళ భారీ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు చేపట్టారు హైడ్రా అధికారులు.పార్థసారథి వేసిన ఫెన్సింగ్ తో పాటు లోపల ఉన్న షెడ్డులను తొలగించారు హైడ్రా అధికారులు. ఐదు ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులను ఏర్పాటు చేసింది హైడ్రా.