
- పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ శివార్లలోని చెరువుల కబ్జాపై హైడ్రా కొరడా ఝుళిపించింది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని నెక్నాంపూర్ చిన్న చెరువులో భారీ ఎత్తున జరిగిన ఆక్రమణలను మంగళవారం కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లను ఆక్రమించి, మట్టితో పూడ్చివేసిన పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ అనే నిర్మాణ సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేయించింది. హైడ్రా అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న నెక్నాంపూర్ చిన్న చెరువులో ఏకంగా రెండున్నర ఎకరాలకు పైగా భూమిని పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ సంస్థ కబ్జా చేసింది.
చెరువు భూమిలో భారీగా మట్టిని నింపి, రోడ్లు వేసి, తాత్కాలిక షెడ్లను నిర్మించింది. ఈ అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది జేసీబీలతో నేలమట్టం చేశారు. అంతేకాకుండా, చెరువులో నింపిన వేలాది టిప్పర్ల మట్టిని తిరిగి తొలగించి, దానిని సదరు నిర్మాణ సంస్థకు చెందిన స్థలంలోనే పోశారు.
చెరువు భూమిని కబ్జా చేసినందుకు పూజ క్రాఫ్టెడ్ హోమ్స్ యజమానులపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించింది. వారి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీస్ స్టేషన్లో నిర్మాణ సంస్థపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. చెరువుల పరిరక్షణ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఈ చర్యల ద్వారా హైడ్రా స్పష్టం చేసింది.