నిజాంపేటలో రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జాదారుల చెర నుంచి కాపాడింది హైడ్రా. నిజాంపేటలో సర్వే నంబర్ 191లో ఉన్న 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూమి కబ్జా గురించి ఫిర్యాదులు అందడంతో గురువారం రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు ఆక్రమణలు తొలగించారు. కబ్జాకు గురైన భూమి విలువ మార్కెట్ వాల్యూ ప్రకారం 750 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు అధికారులు.
గత కొంతకాలంగా ఈ భూమిని ఆక్రమిస్తూ వస్తున్నారని హైడ్రాకు ఫిర్యాదు చేశారు స్థానికులు. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విచారణలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు తేలడంతో చర్యలు చేపట్టారు అధికారులు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టారు. ఇందులో భాగంగా నివాసాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా నిర్మించిన షెడ్లను, ప్రహరీ గోడలను కూల్చేశారు అధికారులు. పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు అధికారులు. స్వాధీనం చేసుకున్న 10 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు అధికారులు.

