హైడ్రా ఉక్కుపాదం.. 6 క్రషింగ్ యూనిట్లు నేలమట్టం, 12 RMC ప్లాంట్లు తొలగింపు

హైడ్రా  ఉక్కుపాదం.. 6 క్రషింగ్ యూనిట్లు నేలమట్టం, 12 RMC ప్లాంట్లు తొలగింపు

హైదరాబాద్ నగర శివార్లలో అక్రమ మైనింగ్ పై  హైడ్రా షాక్ ఇచ్చింది. నిబంధనలను తుంగలో తొక్కి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న అక్రమ యూనిట్లపై హైడ్రా కొరడా ఝులిపించింది. మే 5న ఈరోజు తెల్లవారుజాము నుంచే నగరవ్యాప్తంగా 6 ప్రధాన ప్రాంతాల్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. వట్టినాగులపల్లి, గౌలిదొడ్డి, కొత్వాల్‌గూడ వంటి ప్రాంతాల్లో అక్రమంగా కొనసాగుతున్న 6 స్టోన్ క్రషింగ్ యూనిట్లను అధికారులు నేలమట్టం చేశారు. వీటితో పాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 12 RMC (Ready Mix Concrete) ప్లాంట్లను పూర్తిగా తొలగించారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే మైనింగ్ సాగించడం, ఇష్టానుసారంగా క్వారీ తవ్వకాలు జరపడం .. భారీ రాళ్ల పేలుళ్ల వల్ల స్థానిక నివాసాలకు ముప్పు పొంచి ఉండటమే కాకుండా.. విపరీతమైన దుమ్ముతో పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. గతంలో అధికారులు కరెంట్ కట్ చేసినా.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డీజిల్ ఇంజన్లతో కార్యకలాపాలు సాగించాయి.  ప్రధానంగా గ్రేట్ ఇండియా మైనింగ్ సంస్థ, పరమేష్ సింగ్ స్టోన్ క్రషర్, శ్రీ లక్ష్మి కన్‌స్ట్రక్షన్స్, పృథ్వి స్టోన్ క్రషర్, రాఘవ స్టోన్ క్రషర్ ,మక్తా భగత్ సింగ్ వంటి యూనిట్లపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంది. PCB, మైనింగ్ శాఖలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. రంగారెడ్డి కలెక్టర్ లేఖ మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. భవిష్యత్తులో ఇక్కడ మళ్లీ ఎలాంటి కార్యకలాపాలు జరగకుండా భారీ యంత్రాలను కూడా అక్కడి నుంచి తొలగించారు.