నాంపల్లి ఘటనపై హైడ్రా సీరియస్.. స్టాండర్డ్ ఫర్నిచర్ షాపు సీజ్..

నాంపల్లి ఘటనపై హైడ్రా సీరియస్.. స్టాండర్డ్ ఫర్నిచర్ షాపు సీజ్..

ఇటీవల నాంపల్లిలోని బచ్చాస్ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదాన్ని సీరియస్ గా తీసుకుంది హైడ్రా. ఇద్దరు చిన్న పిల్లలు సహా వారిని కాపాడేందుకు వెళ్లిన మరో ముగ్గురు కూడా మరణించిన ఈ ఘటన తర్వాత జీహెచ్ఎంసీ, ఫైర్ సిబ్బందితో కలిసి ఫర్నిచర్ షాపులలో తనిఖీలు చేపట్టారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. గురువారం ( జనవరి 29 ) నాంపల్లిలో తనిఖీలు చేపట్టిన కమిషనర్ రంగనాథ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్టాండర్డ్ ఫర్నిచర్ షాపును సీజ్ చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్నిప్రమాదాలకు కారణమయ్యే ప్రమాదకర పరిస్థితులు పలు షాపుల్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. హైడ్రా ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో క్షేత్రస్థాయి తనిఖీలు కొనసాగుతాయని... అగ్నిమాపక భద్రతా నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.  

ఫైర్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన వీడియోలు లేదా ఫోటోలు ఉంటే ప్రజలు హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667కు పంపాలని కమిషనర్ రంగనాథ్ విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతోనే ఇటువంటి ప్రమాదాలను నివారించగలమని ఆయన పేర్కొన్నారు.