ఎల్జీ గ్యాస్‌ లీకేజీ ఘ‌ట‌నపై సీఎంకు నివేదిక స‌మ‌ర్పించిన‌ హైపవర్ కమిటీ

ఎల్జీ గ్యాస్‌ లీకేజీ ఘ‌ట‌నపై సీఎంకు నివేదిక స‌మ‌ర్పించిన‌ హైపవర్ కమిటీ

అమరావ‌తి: విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌లీక్‌ ఘటనపై హైపవర్ కమిటీ నివేదిక సమర్పించింది. సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తుది నివేదికను స‌మ‌ర్పించింది. గ్యాస్ లీకేజీపై కమిటీ చేసిన విచారణలో తేలిన వివరాలను సీఎంకు వివరించింది. ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్ లీకేజీకి కారణాలు.. ఘటన జరిగిన సమయంలో ఏం జరిగింది. ఎవరిదైనా నిర్లక్ష్యం ఉందా అనే అంశాలపై అధ్యయనం చేసింది. అటవీ పర్యావరణ కార్యదర్శి తో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , వైజాగ్ పోలీస్ కమిషనర్, కలెక్టర్ ఉన్న ఈ కమిటీ.. ఆ కంపెనీలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, గ్యాస్ లీకేజీ ప్రభావం తదితర అంశాల్ని నివేదికలో ప్రస్తావించింది. ఐదు గ్రామాల ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు, అధికారులు, సీనియర్ జర్నలిస్ట్‌ల‌‌‌తో చర్చించిన క‌మిటీ.. వారి ఆధారంగా నివేదికను సిద్ధం చేసింది. నివేదిక సమర్పణ‌ సందర్భంగా విశాఖ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌, నగర కమిషనర్‌ ఆర్కే మీనా పాల్గొన్నారు.

మే 7న విశాఖ లోని వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 15మంది చనిపోగా.. వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించి బాధితులను ఆదుకుంది.