పద్మారావునగర్, వెలుగు: అందెశ్రీ ఐదేండ్లుగా హైపర్ టెన్షన్‌తో బాధపడ్తున్నారని, నెల నుంచి బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవడం మానేశారని, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోవడంతోనే మరణించారని డాక్టర్లు తెలిపారు. సోమవారం ఉదయం 6. 20 గంటలకు కదలలేని స్థితిలో ఇంట్లో పడిపోయి ఉన్న అందెశ్రీని కుటుంబసభ్యులు ఉదయం 7.20 గంటలకు అంబులెన్స్ లో గాంధీ దవాఖాన ఎమర్జెన్సీ వార్డుకు తీసుకువచ్చారు. అయితే, ఆయన చనిపోయి అప్పటికే ఐదు గంటలు గడిచిందని డాక్టర్లు ప్రకటించారు. ‘‘అందెశ్రీకి ఐదేండ్లుగా హైపర్ టెన్షన్ (బీపీ) ఉంది. నెల రోజుల నుంచి బీపీ మందులు వాడటం లేదని ఫ్యామిలీ మెంబర్స్చెప్పారు.
అందువల్లే ఆయనకు గుండెపోటు వచ్చింది” అని గాంధీ దవాఖాన జనరల్ మెడిసిన్హెచ్వోడీ ప్రొఫెసర్సునీల్కుమార్ తెలిపారు. మూడు రోజులుగా ఆయాసం ఉందని, ఛాతిలో నొప్పిగా ఉందంటూ కుటుంబసభ్యులకు చెప్పారని.. అయినా దవాఖానకు వెళ్లలేదని సునీల్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసి మామూలుగా పడుకున్నారని, ఉదయం 6.20 గంటలకు బాత్రూమ్వద్ద కింద పడిపోయిన స్థితిలో కుటుంబసభ్యులు గుర్తించి గాంధీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారని అందెశ్రీని పరీక్షించిన ఆర్ఎంవో డాక్టర్సింధూర చెప్పారు.
అయితే, అప్పటికే ఆయన ప్రాణాలతో లేరని స్పష్టం చేశారు. అందెశ్రీ అర్ధరాత్రి రెండు గంటల వేళ బాత్రూమ్కు వెళ్తూ గుండెపోటు రావడంతో చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. గాంధీ దవాఖాన నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో లాలాపేట వినోభానగర్ లోని ఆయన నివాసానికి పార్థివదేహాన్ని తరలించామని దవాఖాన సూపరింటెండెంట్‌డా.వాణి పేర్కొన్నారు.
