నన్ను చూసి చంద్రుడే ఈర్ష్యపడతాడు

నన్ను చూసి చంద్రుడే ఈర్ష్యపడతాడు
  • మంత్రి శ్రీనివాస్ హత్యకు కుట్ర.. ఓ డ్రామా
  • పోలీసులు టీఆర్ఎస్ సర్కార్ తొత్తులుగా మారారు
  • ఏపీ జితేందర్ అంటే ఆల్ పార్టీ జితేందర్ 

హైదరాబాద్: తనను చూసి చంద్రుడే ఈర్ష్యపడతాడని, అలాంటి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు  బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రలో తన హస్తం ఉందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని జితేందర్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర అనేది సీఎం కేసీఆర్ ఆడుతున్న ఓ పెద్ద డ్రామా అని కొట్టిపారేశారు. బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ దూసుకుపోతోందని, ఆయన ఎక్కడ కాలు మోపితే అక్కడ విజయం వరిస్తుందన్నారు. అందుకే ఆయన త్వరలో చేపట్టబోయే రెండో విడత పాదయాత్రను ఆపడానికి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారన్నారు. దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జిగా ఉండి.. బీజేపీని గెలిపించానని నమ్మిన పార్టీ తనకు మిషన్ 19 బాధ్యత అప్పగించిందన్నారు. అందుకే తనపై ఎలాగైనా బురద జల్లాలని కేసీఆర్ ఈ మర్డర్ డ్రామాకు తెరదీశారన్నారు. అందరితో సఖ్యతగా ఉంటానని, అందుకే తనను అందరూ ఆల్ పార్టీ జితేందర్ అంటారన్నారు. అలాంటి తనపై హత్యారోపణలు చేయడం సరికాదన్నారు. 

పథకం ప్రకారమే దుండగలు తన ఇంటిపై  రాళ్లతో దాడి చేశారని, దాడిని ఆపాల్సిన పోలీసులు టీఆర్ఎస్ సర్కార్ కు తొత్తులుగా వ్యవహరించారని విమర్శించారు. కేసీఆర్ కు డబ్బు, అధికారం మీద దాహమే తప్ప ప్రజల సంక్షేమం గురించి పట్టదన్నారు. తన డ్రైవర్ ఏ తప్పు చేయలేదని, అతడిపై పెట్టిన కేసును వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

విద్యార్థుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు