
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వీఐపీ వాహనాలపై ఉండే సైరన్ లపై కీలక వ్యాఖ్యలు చేశారు. వాటికి స్వస్తి పలకాలని యోచిస్తున్నట్లు స్పష్టం చేశారు. పూణేలోని చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ ప్రకటన చేశారు.
"ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం చాలా ముఖ్యం. వీఐపీల వాహనంపై రెడ్‌లైట్ కు స్వస్తి పలికే అవకాశం లభించడం నా అదృష్టం. ఇప్పుడు వీఐపీ వాహనాలపై సైరన్‌లకు ముగింపు పలకాలని ఆలోచిస్తున్నాను" అని గడ్కరీ చెప్పారు. హార్న్‌లు, సైరన్‌ల శబ్దాన్ని తగ్గించి, వాటి స్థానంలో భారతీయ సంగీత వాయిద్యాల సంగీతంతో భర్తీ చేయాలనుకుంటున్నట్లు గడ్కరీ చెప్పారు. "నేను సైరన్ ధ్వని స్థానంలో బసురి (వేణువు), తబలా, 'శంఖ్' శబ్దంతో ఒక విధానాన్ని రూపొందిస్తున్నాను. ప్రజలు శబ్ద కాలుష్యం నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నాను" అని గడ్కరీ అన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్కరీతో పాటు ఉపముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ , అజిత్ పవార్‌తోపాటు ఇతర స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. ఈ మొత్తం ప్రాజెక్ట్‌లో మొత్తం 4 ఫ్లైఓవర్లు, 1 అండర్‌పాస్ వెడల్పు, 2 కొత్త అండర్‌పాస్‌లు నిర్మించబడ్డాయి. చాందినీ చౌక్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ సాయంతో నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గడ్కరీ తెలిపారు.