
శ్రీనగర్: బీజేపీ, ఆర్ఎస్ఎస్ల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న లౌకికవాదాన్ని రక్షించడమే లక్ష్యంగా భారత్ జోడో యాత్ర చేశానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ యాత్రను తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో చేయలేదని.. దేశ ప్రజల కోసమే చేశానని స్పష్టంచేశారు. మన దేశానికి పునాదుల్లాంటి మౌలిక భావనలను నాశనం చేయాలనుకునే ఐడియాలజీకి వ్యతిరేకంగా నిలబడాలనేదే తన లక్ష్యమన్నారు. రాహుల్ గాంధీ ఐదు నెలల క్రితం ప్రారంభించిన భారత్ జోడోయాత్ర సోమవారం కాశ్మీర్‌లోని శ్రీనగర్ లో ముగిసింది. ఈ సందర్భంగా నగరంలోని షేర్ఎ కాశ్మీర్ స్టేడియంలో ముగింపు సభ నిర్వహించారు. ఎముకలు కొరికే చలి.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచు నడుమ నిలబడి రాహుల్ గాంధీ ప్రసంగించారు. “నేను కాశ్మీర్ లో యాత్ర చేస్తే దాడి జరిగే ముప్పు ఉందని కొందరు హెచ్చరించారు. అయినా నేను నా సొంతగడ్డ కాశ్మీర్ లో, నా వాళ్ల(కాశ్మీరీల) తో కలిసి యాత్ర చేసి తీరాలని నిర్ణయించుకున్నా. నా తెల్ల చొక్కా రంగును ఎరుపుమయం చేసే అవకాశాన్ని శత్రువులకు ఇవ్వాలని డిసైడ్ అయ్యా. కాశ్మీర్ ప్రజలు నాకు హ్యాండ్ గ్రనేడ్స్ ఇవ్వలేదు. మనసారా ప్రేమను పంచారు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు.
ఆ ఫోన్ కాల్స్‌ను ఇంకా మర్చిపోలేదు
‘‘నానమ్మ (ఇందిరా గాంధీ) చనిపోయినపుడు ఫోన్ లో సమాచారం అందింది.. అలాగే నాన్న (రాజీవ్ గాంధీ) హత్యకు గురయ్యారని తెలిసింది కూడా ఫోన్ ద్వారానే.. ఆ రెండు ఫోన్ కాల్స్‌ను నేను ఇంకా మర్చిపోలేదు. ఆ క్షణంలో మేం పడిన బాధను మాటల్లో చెప్పలేను. ఆ దారుణానికి పాల్పడిన వాళ్లు మా బాధ అర్థం చేసుకోలేరు” అని రాహుల్ చెప్పారు. ‘మోడీ, అమిత్ షా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి హింసను ప్రేరేపించే వాళ్లకు మాలాంటి వాళ్ల బాధ అర్ధం కాదు. సైనికుల కుటుంబాలు, పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాలు అర్ధం చేసుకోగలవు. అటువంటి ఫోన్ కాల్ వస్తే ఎలాంటి బాధ కలుగుతుందో కాశ్మీరీలు కూడా అర్థం చేసుకోగలరు” అని ఆయన కామెంట్ చేశారు. ‘ఇలాంటి మరణవార్తలను చేరవేసే ఫోన్ కాల్స్‌ను ఆపేయాలనే సంకల్పంతోనే భారత జోడో యాత్ర చేశాను. బీజేపీకి ధైర్యముంటే ఇలాంటి యాత్రను కాశ్మీర్ లో చేయాలి. భయంతో వణికిపోతున్న బీజేపీ నాయకులకు యాత్ర చేసే ధైర్యం లేదు’ అని రాహుల్ కామెంట్ చేశారు. అంతకుముందు శ్రీనగర్ లోని భారత్ జోడోయాత్ర క్యాంప్ సైట్లో మువ్వన్నెల జాతీయ జెండాను రాహుల్ గాంధీ ఆవిష్కరించారు. అనంతరం రాహుల్ గాంధీని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.
పలు పార్టీల గైర్హాజరు..
స్థానికులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్దగా రాకపోవడంతో భారత్ జోడో యాత్ర ముగింపు సభ కోసం వేసిన కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. తీవ్రమైన చలి కారణంగా కొన్ని ప్రాంతీయ పార్టీల నాయకులు ఈ మీటింగ్ కు హాజరుకాలేదు. తృణమూల్ కాంగ్రెస్ సహా ఇంకొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు అయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే డీఎంకే, జేఎంఎం, బీఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ, రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, ఐయూఎంఎల్, వీసీకే పార్టీల నేతలు పాల్గొన్నారు.